ఏపీ పోలింగ్ : జాతీయ రహదారిపై ఆందోళన

Andhra Pradesh Elections 2019 Polling LIVE Updates in Telugu - Sakshi

సాక్షి, కృష్ణా : విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 47వ పోలింగ్‌ బూత్‌లో ఉదయం నుంచి ఈవీఎం పనిచేయకపోడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం 6 గంటలలోపు లైన్లలో వేచిఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. అయితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దగ్గర ఉండి ఓట్లు వేయిస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని టీడీపీ నాయకులు తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మరోపక్క వల్లభనేని వంశీ కూడా తన అనుచరులతో అక్కడే ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పశ్చిమ గోదావరి : దెందులూరు నియోజకర్గంలోని ప్రత్తికొల్లలంకలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. ఓటింగ్‌ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఈ వివాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నారంటూ మాజీ సర్పంచ్‌ మహాలక్ష్మీరాజు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న 7 కుటుంబాల సభ్యులపై దాడికి తెగబడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఆస్పత్రిలో బాధితులు..

పశ్చిమ గోదావరి : ఏలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ వీరంగం సృష్టించాడు. స్థానిక 150 వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రామరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనుచరులు పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్నారని రామరాజు మధ్యాహ్నం అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో రామరాజు, అతని తల్లి తండ్రులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. రాత్రి 10 గంటల సమయంలో మరోమారు ఎమ్మెల్యే అల్లుడు మనోజ్‌ రామరాజుపై దాడి చేశాడు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామరాజు

అమరావతి : ఈవీఎంలు మొరాయించడం.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరుగుతుందని ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోందని చెప్పారు. పోలింగ్‌ శాతం 80కి చేరువలో ఉందని తెలిపారు.

సాక్షి, కర్నూలు : రాత్రి తొమ్మిది అవుతోన్న ఆళ్లగడ్డలో పోలింగ్‌ జరుగుతోంది. అయితే టీడీపీ శ్రేణులు దీనికి అడ్డుతగులుతున్నారు. తెలుగు తమ్ముళ్లు రాళ్లతో దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. అప్పటికే నిల్చున్న ఓటర్ల మధ్యలో కొంతమందిని బలవంతంగా చేర్చి వారితో కూడా ఓటు వేయించాలని గొడవకు దిగారు. దీనికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.. రాళ్లురువ్వి భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు, టియర్‌గ్యాస్‌ ప్రయోగించడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి.

హైదరాబాద్‌: తన ఓటమి తప్పదనే భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి దిగజారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ ముగిసిన సందర్భంగా రాత్రి 8:30 గంటలకు వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా జరగకుండా, ఓటింగ్‌ శాతం తగ్గించడానికి చంద్రబాబు అనేక కుట్రలు పన్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. 

8 దాటినా పలుచోట్ల పోలింగ్‌
అమరావతి : రాత్రి 8 దాటినా పలుచోట్ల పోలింగ్‌ కొనసాగుతుంది. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్‌ జరుగుతోంది. చీరాల, గాజువాకలో ఓటర్లు ఇంకా బారులు తీరారు.

అప్పుడే రీపోలింగ్‌పై నిర్ణయం..
అమరావతి : సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పైగా పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారని, ఆరుచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసారని తెలిపారు. ఈ అన్నివిషయాలను కేంద్రఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాజకీయపార్టీలు రీపోలింగ్ కూడా కోరుతున్నాయని, కేంద్ర ఎన్నికల పరిశీలకుల స్క్రూటీని తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకు పోలింగ్‌ ఆగిపోయిందని, రిపోలింగ్‌ నిర్వహించే విషయంపై పరిశీలిస్తున్నామన్నారు. క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించామని తెలిపారు. ఇక మొత్తం పోలింగ్‌ 80 శాతం పైగా అయ్యే అవకాశం ఉందన్నారు.

సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడి
అనంతపురం: కదిరిలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడికి యత్నించారు. వారిని ఆయన గన్‌మెన్ గిరి అడ్డుకోగా... అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కదిరి లోని 88 పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలైన ఓట్ల శాతం 65.96 
శ్రీకాకుళం  63.77 % 
విజయనగరం 74.18% 
విశాఖపట్నం  55.82 %
తూర్పుగోదావరి 69.85 %
పశ్చిమగోదావరి 67.28 %
కృష్ణా  64.50 %
గుంటూరు  61.12 %
ప్రకాశం 70.74  %
నెల్లూరు  66.90 %
కడప  63.90 %
కర్నూలు   63 %
అనంతపురం 67.08 %
చిత్తూరు 69.32 % 

అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉండాలి: విజయసాయిరెడ్డి
హైదరాబాద్‌ : ఈవీఎంలు సీల్‌ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌ పంపేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎలాంటి కుయుక్తులైనా పాల్పడే అవకాశం ఉందని, పోలింగ్‌ ముగిసే చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్యూలైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ముగిసిన పోలింగ్‌ సమయం.. బారులు తీరిన ఓటర్లు
అమరావతి : ఎన్నికల పోలింగ్‌ ముగిసినప్పటికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గడువులోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి మరి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైనప్పటికి.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం.. పార్టీల నేతలు వాగ్వాదాలకు దిగడంతో పోలింగ్‌కు కొంత ఆలస్యమైంది. ఇక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయినా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 

హెలీకాప్టర్ల ద్వారా ఈవీఎంల తరలింపు 

తూర్పుగోదావరి జిల్లా : రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన గుర్తేడు - 4, దారగండి -1, పాతకోట - 1 బొద్దగండి - 1 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలతోపాటు ఎన్నికల సిబ్బందిని రెండు ఓఎన్జీసీ హెలీకాప్టర్ల ద్వార కాకినాడకు తరలించారు. వాకలపూడిలోని నేవి బేస్‌కు ఎజెన్సీ ఎన్నికల సిబ్బంది చేరుకుంది.

పోలింగ్ ముగింపుకు కౌంట్ డౌన్..
అమరావతి : పోలింగ్‌ ముగింపుకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది విజ్ఞప్తి చేశారు. 6 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. క్యూలైన్‌లో ఉన్న చివరి ఓటరు నుంచి ఓటరు స్లిప్‌లు జారీ చేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలింగ్‌ కొంత ఆలస్యం అవుతుందన్నారు.

4 గంటల వరకు 54.66 శాతం పోలింగ్‌
అమరావతి: సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 54.66 శాతం పోలింగ్‌ నమోదైంది. గడువులోపు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన వారికి ఎంతసమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక జిల్లాల వారిగా 4 గంటల వరకు నమోదైన పోలింగ్‌ వివరాలు
శ్రీకాకుళం  52.11 %
విజయనగరం 62.30%
విశాఖపట్నం  45.79 %
తూర్పుగోదావరి 57.32 %
పశ్చిమగోదావరి 55.67 %
కృష్ణా  52.53%
గుంటూరు 52.41%
ప్రకాశం 56.47  %
నెల్లూరు  56.29 %
కడప  56.44 %
కర్నూలు 51 %
అనంతపురం 54.96 %
చిత్తూరు 57.30%
 

రీపోలింగ్‌కు డిమాండ్‌
అనంతపురం : పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండలంలోని తలమర్ల గ్రామంలో ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్‌ కూడా పూర్తికాలేదు. దీంతో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

మావోయిస్టు ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌
అమరావతి : మావోయిస్టు ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్‌ ముగిసింది.

ఎమ్మెల్యే పుష్పవాణిపై దాడి
విజయనగరం: జియ్యమ్మవలస మండలం చినకుదమలో ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పుష్పవాణిపై టీడీపీ నేత రామకృష్ణ దాడి చేశారు. పోలీసులు లేకపోవడంతో పుష్పవాణికి ప్రజలు రక్షణగా నిలిచారు.

పోలీసుల సమక్షంలోనే టీడీపీ రిగ్గింగ్‌..
గుంటూరు : చిలకలూరి పేటలో పోలీసుల సాయంతోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు బయటపెట్టారు. టీడీపీ నేతలు పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా.. బయట పోలీసులు కాపలా ఉన్నారు.

కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
చిత్తూరు జిల్లా : పుంగనూరు నియోజకవర్గం వనములదిన్నె పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాన్ని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరిశీలించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారన్నారు.  

పోలింగ్‌ బూత్‌లో ప్రచారం.. ఓటర్‌ ఐడీలో రిగ్గింగ్‌
విశాఖపట్నం : పశ్చిమ నియోజవర్గం, బుచ్చిరాజుపాలెంలోని సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్‌లో టీడీపీ నేతలు బరితెగించారు.
 59, 60,61,పోలింగ్ బూతుల్లో సైకిల్‌కు ఓటెయ్యాలంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈవాగ్వాదం సందర్భంగా టీడీపీ నేతల నుంచి ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఈ ఓటర్ కార్డులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపించారు.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మృతి
చిత్తూరు : టీడీపీ నేతల దాడిలో గాయపడి వెంకట్రాయపరెడ్డి అనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త మృతి చెందారు. పెద్దతిప్పసముద్రం మండలం టీ సదుంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌ బూత్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను వెంకట్రాయపరెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు వెంకట్రాయపరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన వెంకట్రాయపరెడ్డి ప్రాణాలు కోల్పోయారు.

అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు.

మందకొడిగా పోలింగ్‌..
విజయనగరం జిల్లా : నెల్లిమర్ల నియోజకవర్గం బోగాపురం మండలం సవరవిల్లిలో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. క్యూలైన్ లో సుమారుగా 700 మంది ఓటర్లున్నారు.

టీడీపీ దష్ప్రచారంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఫైర్‌
హైదరాబాద్‌ : తన పేరుతో ఓ నకిలీ ట్వీట్‌ ఇమేజ్‌ను ప్రచారం చేస్తున్న టీడీపీపై వైఎస్సార్‌ సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఫైర్‌ అయ్యారు. ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారిన చర్యలకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారన్నారు. అసత్యాలు, నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని బై..బై.. బాబు అంటూ ట్వీట్‌ చేశారు.

పేట్రేగిన టీడీపీ శ్రేణులు..
చిత్తూరు : పూతలపట్టులో టీడీపీ శ్రేణులు పేట్రేగాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఎంఎస్‌ బాబును ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది.

రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని ..
అనంతపురం : ప్రసన్నాయనపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వివాదం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వక్తం చేశారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను వదిలేసారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈవీఎం సామాగ్రి ధ్వంసం
వైఎస్సార్‌ జిల్లా : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లెలో టీడీపీ నేత హల్చల్‌ చేశాడు. పోలింగ్ బూత్‌ 176 లోకి ప్రవేశించి మరి ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఇంత చేసినా పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు.

మధ్యాహ్నం 3.30 గంటల వరకు జిల్లాలవారిగా పోలింగ్‌
శ్రీకాకుళం 54%
విజయనగరం 63%
విశాఖపట్నం 51%
తూర్పుగోదావరి 52%
పశ్చిమగోదావరి 50 %
కృష్ణా 51 %,
గుంటూరు  50 %
ప్రకాశం   58 %
నెల్లూరు  53 %
చిత్తూరు  57 %
కర్నూలు 40 %
కడప   63  %
అనంతపురం 53%,

కర్నూలు :  టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌పై బీజేపీ అభ్యర్థి బీవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ భరత్‌ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పోలీసులకు లంచాలు ఇచ్చి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బూత్‌ల వద్ద అనుచరులతో కలిసి టీజీ భరత్‌ హడావిడి చేస్తున్నారన్నారు.

ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ
విజయనగరం: సాలూరు నియోజకవర్గం, ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామంలో గిరిజనులను ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు.

గుంటూరు : మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. దళితులను ఓటింగ్‌కు వెళ్లనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకొని గ్రామానికి వెళ్లిన గురజాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గ్రామానికి ఎందుకు వచ్చావంటూ రెండు కార్లను ధ్వంసం చేశారు.

పూతలపట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిడ్నాప్‌

చిత్తూరు :  పూతలపట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంఎస్‌ బాబును టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ నేతలు భౌతికదాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మంత్రి ప్రతిపాటి భార్య బెదిరింపులు

గుంటూరు: చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య బెదిరింపులకు దిగారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల వైపు వేలు చూపిస్తూ ఆమె వార్నింగ్‌ ఇవ్వడంతో మంత్రి సతీమణి తీరుపై ఎన్నికల సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • విజయనగరం: బాడంగి మండలం ముగడలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేసి కొట్టారు. అంతేకాకుండా ఆయనను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపేసి.. అరాచకంగా ప్రవర్తించారు.
  • తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం సొరకాయలపాలెంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
  • వైఎస్సార్‌ జిల్లా : ప్రొద్దుటూరులోని వసంతపేట స్కూల్‌ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి.. లాఠీచార్జ్‌ చేశారు.

2 లక్షలతో పట్టుబడ్డ గంటా అనుచరుడు

  • విశాఖపట్నం: ఒకవైపు పోలింగ్‌ జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో టీడీపీ నాయకుడు డబ్బుతో పట్టుబడ్డాడు. మర్రిపాలెం జ్యోతినగర్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కొప్పిరెడ్డి రామకృష్ణ రూ. 2 లక్షలతో దొరికిపోయాడు. అతను ఈ డబ్బును ఓటర్లకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.

ఓటింగ్‌ శాతం వివరాలివి..
చిత్తూరు జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతం కొనసాగుతోంది. ఓటర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటవరకు నమోదైన సరాసరి ఓటింగ్‌ శాతం  నియోజకవర్గాలవారీగా ఈ కిందివిధంగా ఉంది.

  • తంబల్లపల్లి : 43.80%
  • పీలేరు : 37%
  • పుంగనూరు : 46%
  • చంద్రగిరి : 32%
  • సత్యవేడు : 38%
  • జీడీ నెల్లూరు : 40.56%
  • చిత్తూరు : 38%
  • కుప్పం : 44.60%

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలవరకు జిల్లాలో మొత్తంగా 20.41 శాతం  పోలింగ్‌ నమైందింది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..

  • కొవ్వూరు : 23.86 %  
  • నిడదవోలు : 12.14 %  
  • ఉంగుటూరు : 21.15 %  
  • ఏలూరు : 32.50 %  
  • నర్సాపురం : 25.81 %  
  • పాలకొల్లు : 12 %
  • భీమవరం : 20.20 %  
  • ఆచంట : 26.60 %  
  • ఉండి : 11.2 %
  • తణుకు : 16.76 %  
  • చింతలపూడి : 27.89 %  
  • దెందులూరు : 25 %  
  • గోపాలపురం : 31 %  
  • తాడేపల్లిగూడెం : 21 %  
  • పోలవరం : 28 %  

ఉదయం 11 గంటలవరకు అందిన సమాచారం మేరకు జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం 19.78%, విజయనగరం  31.57%,  విశాఖపట్నం 21.64 %, తూర్పుగోదావరి 27.50%,  పశ్చిమగోదావరి 20.41 %, కృష్ణా 24.10 %,  గుంటూరు  24 %, ప్రకాశం  22 %, నెల్లూరు  23.32%, చిత్తూరు  25.18 %, కర్నూలు 23 %, కడప   17.84 % పోలింగ్‌ నమోదైంది.

అనంతపురం జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నాం వరకు ఓటర్లు పోటెత్తుత్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు జల్లా వ్యాప్తంగా 38.86 శాతం పోలింగ్‌ నమోదైంది.

రాయదుర్గం : 26.00​‍​‍%
ఉరవకొండ : 47.00%
తాడిపత్రి : 27.62%
గుంతకల్ ‌‌: 39.00%
సింగనమల : 37.14%
అనంపురం అర్బన్ ‌: 29.00%
కళ్యాణదుర్గం : 49.00%
రాప్తాడు : 31.30%
మడకశిర : 42.00%
హిందూపురం : 38.00%
పెనుకొండ :49.00%
పుటపర్తి : 37.00%
ధర్మవరం :51.00%
కదిరి: 41.33%

అనిల్‌కుమార్‌ యాదవ్‌పై దాడి
నెల్లూరు :
నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్‌ స్కూల్‌ వద్ద పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆయనపై దాడి చేశారు.

గోపిరెడ్డిని కారుతో ఢీకొట్టిన ‘పచ్చ’ నేత
గుంటూరు:
యలమందలో టీడీపీ నేతలు గూండాయిజానికి దిగారు. నర్సరావుపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకుడు కడియల రమేశ్‌ దాడికి దిగాడు. అంతేకాకుండా గోపిరెడ్డిని కారుతో అతను ఢీకొట్టాడు. దీంతో గోపిరెడ్డి గాయపడ్డారు. బరితెగించి మరీ టీడీపీ నేతలు పోలింగ్‌ రోజున రెచ్చిపోతుండటంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిగోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను సైతం కిడ్నాప్‌ చేశారని, ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

తాడిపత్రిలో దాష్టీకం

  • అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించారు. ఇక్కడి వీరాపురంలో జేసీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు వేట కోడవళ్లతో దాడులకు దిగారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు.
    చదవండి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణహత్య

దుష్ప్రచారాన్ని నమ్మకండి: ద్వివేది

  • రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని, సమస్యలు లేవని తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కొన్ని టీవీ చానెళ్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన వెల్లడించారు. ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి వెళ్తుందన్నది కూడా దుష్ప్రచారమేనని, ఈవీఎంలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన ఓటర్లకు సూచించారు.
    చదవండి: మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది

పచ్చపార్టీ నేతల దౌర్జన్యం

  • పచ్చపార్టీ నేతలు పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించేలా కొన్ని ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సావవంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. కొన్నిచోట్ల మొదట ఈవీఎంలు మొరాయించినా.. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం కావడంతో దాదాపు రాష్ట్రమంతటా పోలింగ్‌ సజావుగా సాగుతోంది.
    చదవండి: రెచ్చిపోతున్న పచ్చపార్టీ నేతలు

సీఈవోను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

అమరావతి : రాష్ట్రంలో పోలింగ్‌ నేపథ్యంలో ఈవీఎంలపై పచ్చ మీడియాలో దుష్ప్రచారాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం ఈసీని కలిశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్‌, పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన పరిస్థితులు సీఈవోకు వివరించిన వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్‌ నాగిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్‌ అంటున్నారని విమర్శించారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ, నాగిరెడ్డి మండిపడ్డారు. పచ్చ చొక్కాలతో పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారని, ఇలా చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని వారు అన్నారు.  

టీడీపీ ప్రలోభాలు..
ప్రకాశం:
పోలింగ్‌ రోజున కూడా టీడీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపేటలో ఏకంగా పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేత ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాడు. దీంతో పోలింగ్‌ కేంద్ర వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత చుండూరు వాసును పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతా: డీఎల్‌
వైఎస్సార్‌ జిల్లా:
తనపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు డీఎల్‌ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఇందుకుగాను పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతానని డీఎల్‌ హెచ్చరించారు.

స్వేచ్ఛగా ఓటు వేయండి..
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, పలుచోట్ల ఈవీఎంలలో తలెత్తిన లోపాలు సరిదిద్దామని తెలిపింది.
చదవండి: ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన

ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌ శాతాలివే!

ఏపీ అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు.. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నా.. చాలావరకు పోలింగ్‌ పెద్ద ఎత్తున సాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్‌ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..

  • అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.95శాతం పోలింగ్‌ నమోదు
  • నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 14శాతం పోలింగ్‌ నమోదు
  • తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 12.36శాతం పోలింగ్‌ నమోదు
  • విజయనగరం: కురపాం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15శాతం నమోదు

దాడులు.. దౌర్జన్యాలు.. రాప్తాడులో ఉద్రిక్తత!

  • అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి దిగుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు సనపలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు రాళ్ల దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరూరు గ్రామంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఏకంగా ఓటర్లను బెదిరించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

టీజీ వెంకటేశ్‌ హల్‌చల్‌
కర్నూలు:
పోలింగ్‌ కేంద్రాల బూత్‌ల వద్ద టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఓటర్లు టీడీపీకి ఓటు వేసేలా ఆయన పోలింగ్‌ కేంద్రాల వద్ద వ్యవహరిస్తుండటంపై ఆయన తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్‌ జిల్లా : జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

  • ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.  వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్‌ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఓటర్లతో కలిసి ధర్నాకు దిగారు.

     
  • శ్రీకాకుళం : సంతబొమ్మాలి మండలం నిమ్మడలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సిబ్బందిపై అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరింపులకు దిగారు. నిమ్మడ పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరాలను తొలగించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ఇంత జరుగుతున్నా పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు రాకపోవడం గమనార్హం.

వైఎస్‌ జగన్‌ వల్ల ‘హోదా’ సజీవంగా ఉంది!

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు. యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పులివెందులలో వైఎస్‌ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత

  • వైఎస్సార్‌ జిల్లా: పొట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దౌర్జన్యానికి దిగారు. పొట్లదుర్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీ ఏజెంట్‌పై సీఎం రమేశ్‌ చేయి చేసుకున్నారు.
  • చిత్తూరు: ఐరాలం మండల నాంపల్లి, పేరయ్యగారిపల్లి, కమ్మకిందపల్లిలో ఓటు వేసేందుకు వెళుతున్న దళితులను అడ్డుకున్న టీడీపీ..
  • విశాఖ: పాయకరావుపేట మండలం పింటకోట పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ గుర్తు పడకపోవడంతో పోలింగ్‌ నిలిపివేత
  • గుంటూరు: నర్సరావుపేట రామచంద్రాపురం పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతలు

టీడీపీ దౌర్జన్యం.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల కిడ్నాప్‌!

  • గుంటూరు: నర్సరావుపేట మండలం యలమందలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకొని.. వారిని టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఒక ఏజెంట్‌ గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ నర్సరావుపేట అభ్యర్థి  గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపైనా పచ్చ పార్టీ నేతలు దాడికి దిగారు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌తోపాటు మీడియా ప్రతినిధి కెమెరా ధ్వంసమయ్యాయి.

  • మంగళగిరి : ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్‌ దంపతులు ఓటు వేశారు.

మొరాయిస్తున్న ఈవీఎంలు..

  • రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్ని చోట్ల పోలింగ్‌ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7.40 గంటల కల్లా అందుతున్న సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం  లేదు.

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌..

  • పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని  ఆశిస్తున్నట్టు తెలిపారు. జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్‌ పులివెందులలోని భాకరాపురం ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు.  ముందుగా లోక్‌సభ అభ్యర్థికి, ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఆయన ఓటు వేశారు.  ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి బయల్దేరే ముందు వైఎస్‌ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.  

  • రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ  ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హై స్కూల్ లో పోలింగ్‌ తీరును ఆయన పరిశీలించారు. మొరాయించిన ఈవీఎంలను టెక్నికల్‌ టీమ్‌ రిపేర్‌ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంతం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు.

  • గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌ బూగ్‌ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. 210 బూత్‌లో ఇంకా మాక్‌ పోలింగ్‌ ప్రారంభం కాలేదు. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. 
  • పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రంలోఈవీఎం మొరాయించింది. గట్టిగా నొక్కినా ఓట్లు పడలేదు. అలాగే ఓటు వేశాక బీప్‌ సౌండ్‌ రాలేదు. ఏజెంట్లు రానిపక్షంలో వారి కోసం 15 నిముషాలు ఎదురుచూశారు.  నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,120 పోలింగ్‌ కేంద్రాలకు గాను 28,000 చోట్ల వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.
     
  • ఆంధ్ర్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7గంటలకు సాఫీగా ప్రారంభంమైంది. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఐదున్నర గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలీంగ్‌ నిర్వహించారు. అన్ని పార్టీల ఏజెంట్లు మాక్‌పోలింగ్‌కి అందుబాటులో ఉండేలా చూసి ఈ మాక్‌పోలింగ్‌ను జరిపారు.  రాష్ట్రంలో175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు గాను  46,120 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top