ఒక్కో విల్లాను రూ. 5 కోట్లకు అమ్ముకున్నారు: ఆర్కే

Alla Rama Krishna Reddy Fires On Lingamaneni Over Constructions In Mangalagiri - Sakshi

సాక్షి, విజయవాడ : కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే అక్రమాలకు పాల్పడిన లింగమనేని రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా... లింగమనేని 40 ఎకరాల్లో లే ఔట్లు వేసి..విలాసవంతమైన విల్లాలు కట్టారని ఆర్కే పేర్కొన్నారు. 2005-2006 నుంచి విల్లాలు నిర్మించి ఒక్కొక్క విల్లాను రూ. 5 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదని ఆరోపించారు. ఆ కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతికి కట్టాల్సిన లే ఔట్ ఫీజు ఇప్పటిదాకా కట్టలేదన్నారు. ‘ గజం భూమి విలువ రూ. 4 వేలుగా రిజిస్ట్రేషన్‌ విలువ చూపించారు. వీటి ద్వారాసుమారుగా 50 నుండి 60 కోట్ల రూపాయలు ఎగవేశారు. వ్యవస్థను పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళ జేబులు నింపుకున్నారు. చట్టవ్యతిరేకమైన పద్ధతిలో వేరే వాళ్లకు మార్పిడి చేసుకున్నారు. రూ. 250 కోట్లరూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తున్నారు’  అని ఆర్కే ఆరోపించారు.

చదవండి : అక్రమాల గని.. ‘లింగమనేని’

ఇబ్బంది పడాల్సి వస్తుంది!
‘నిజానికి మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే. అనుమతి లేని ఏ భవన యజమానులకైనా సీఆర్డీఏ నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నాం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది’ అని ఆర్కే పేర్కొన్నారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని ఇక్కడ ఇల్లు కడితే, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్స్‌ చెక్‌ చేసుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top