
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటామని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ హెచ్చరించింది. ఢిల్లీ ప్రచార బాధ్యతలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో కమల్‌నాథ్ పేరు ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఢిల్లీలో కమల్‌నాథ్ ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకుంటామని అకాలీ దల్ నాయకుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ మాజిందర్ సింగ్ సిర్సా స‍్పష్టం చేశారు. సిర్సా మాట్లాడుతూ..సిక్కుల ఊచకోతకు కారణమైన వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కమల్‌నాథ్ నేరాలను రుజువు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు సీఎం పదవి ఇచ్చిందని విమర్శించారు.