
కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో నెట్టగా తాజాగా మరో నేత అహ్మద్ పటేల్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో పార్టీని సెల్ఫ్‌గోల్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభంపై బీజేపీని విమర్శించే క్రమంలో పటేల్ చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 2014 నుంచి పతనమవుతున్న ఆహారోత్పత్తుల ధరలు వ్యవసాయ సంక్షోభానికి సంకేతంగా నిలుస్తాయని ఆయన ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో రైతుల ఆదాయం తగ్గిపోయిందని, ఈ నాలుగేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేవలం 3.6 శాతమే పెరిగాయని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ వేగంగా స్పందించింది. కేంద్రం విధానాలతో ఆహారోత్పత్తుల టోకు ధరల సూచీ దిగివస్తోందని..ఇది వినియోగదారులకు సానుకూల పరిణామమని వ్యాఖ్యానించింది.
‘అహ్మద్‌భాయ్..యూపీఏ హయాంలో అధిక ఆహార ద్రవ్యోల్భణం ఉండేదని అంగీకరించినందుకు ధన్యవాదాలు..రైతుల రాబడి పెంచుతూనే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం నియంత్రిస్తోందని’ పటేల్ ట్వీట్‌కు బదులిస్తూ బీజేపీ నేత జయంత్ సిన్హా బదులిచ్చారు. కాంగ్రెస్ నేతలు నోరు జారడంతో పార్టీకి ఇబ్బందులు ఎదురవడం ఇటీవల ఇది రెండోసారి కావడం గమనార్హం. అలీఘర్‌లో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ చేతులకు ముస్లింల రక్తం మరకలు అంటాయని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఖుర్షీద్ వ్యాఖ్యలపైనా బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్లింల రక్తమే కాదు సిక్కుల రక్తాన్నీ కళ్లచూసిందని ఆరోపించింది.