ఆ ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే..

ADR Report Says Newly Elected Karnataka MLAs Are Crorepatis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు భారీగా బ్లాక్‌మనీ వెదజల్లాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎలక‌్షన్‌ వాచ్‌‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల గురించి నివేదిక విడుదల చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన 221 మంది ఎమ్మెల్యేలలో 215 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది. సగటున ఒక్కో ఎమ్మెల్యే 35 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారని, 2013 ఎన్నికల్లో గెలుపొందిన వారి కంటే ఇది 11 కోట్లు ఎక్కువని వెల్లడించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసినట్లు ఏడీఆర్‌ తెలిపింది.

టాప్‌ 10లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే..
ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలోని టాప్‌ 10 మందిలో ఏడుగురు  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే. హోసకోటె ఎమ్మెల్యే ఎన్‌ నాగరాజు 1015 కోట్ల రూపాయల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. డీకే శివకుమార్‌ 840 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచారు. సురేశ్‌ బీఎస్‌ 416 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు.

కాంగ్రెస్‌కే మొదటి స్థానం...
కొత్తగా ఎన్నికైన చట్టసభ ప్రతినిధుల్లో అత్యధిక మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీలోని 99 శాతం మంది ఎమ్మెల్యేలని కోటీశ్వరులుగా పేర్కొన్న ఏడీఆర్‌.. సగటున ఒక్కో ఎమ్మెల్యే 60 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక 98 శాతం మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే వీరి సగటు ఆస్తుల విలువ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల కంటే చాలా తక్కువ(రూ. 17 కోట్లు)ని పేర్కొంది.

జేడీఎస్‌.. 95 శాతం.. 24 కోట్లు..
ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్న జేడీఎస్‌.. సగటున 24 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్న 95 శాతం ఎమ్మెల్యేలతో మూడో స్థానంలో నిలిచింది.

క్రిమినల్‌ కేసుల్లో కూడా...
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ఆధారంగా.. 221 మంది ఎమ్మెల్యేలలో 35 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది. కాగా ఈ విషయంలో బీజేపీ 41 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రథమ స్థానంలో ఉండగా.. జేడీఎస్‌- కాంగ్రెస్‌లు 30 శాతం మంది ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top