బీజేపీకి షాక్‌ : ఆ మూడు రాష్ట్రాల్లో భంగపాటు

According To ABP News Survey BJP Likely To Face Defeat In MP Chhattisgarh And Rajasthan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి భంగపాటు తప్పదని తాజా సర్వే స్పష్టం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీని మట్టికరిపించి సత్తా చాటుతుందని సీఓటర్‌, ఏబీపీ న్యూస్‌ చేపట్టిన సర్వే వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇమేజ్‌ బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

ఇక తాజా సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ 117 స్ధానాల్లో, చత్తీస్‌గఢ్‌లోని 90 స్ధానాల్లో 54 స్ధానాలు, రాజస్తాన్‌లోని 200 స్ధానాల్లో 130 స్ధానాల్లో గెలుపొంది కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టనుంది. సర్వే అంచనాల ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించనుంది.  ఇక ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 106, 33, 57 స్ధానాలతో సరిపెట్టుకోవచ్చని సర్వే అంచనా వేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసిరానుంది. 

సర్వే అంచనాలు నిజమైతే, మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మవిశ్వాసం, నూతనోత్తేజంతో బరిలో దిగేందుకు ఈ విజయాలు ఉపకరిస్తాయి. ఈ మూడు రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో సైతం ప్రధాని పదవికి అత్యధికులు నరేంద్ర మోదీవైపే మొగ్గు చూపడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top