
సాక్షి, హైదరాబాద్: సామాజిక రచయిత కంచ ఐలయ్యపై భౌతిక దాడులకు దిగుతామంటూ వచ్చిన హెచ్చరికలను ఏఐసీసీ, టీపీసీసీ వేర్వేరు ప్రకటనల్లో సోమవారం ఖండించాయి. ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఈ మేరకు ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం మంచిది కాదన్నారు.
కులాల పేరిట కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అణగారిన వర్గాల తరఫున తార్కికంగా ఆలోచించి, పోరాడే బాధ్యత మేధావులపై ఉందన్నారు. అలాంటివారిపై భౌతిక దాడులకు దిగుతామనే హెచ్చరికలు సరైనవి కావన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పెరిగాయని, వీటిని మానుకోవాలని హెచ్చరించారు.