కౌలు రైతుకు రూ.3వేల పింఛన్‌

3 thousand pension to lease farmer - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

రూ.2లక్షల వరకు రైతు రుణాల మాఫీ..

బ్యాంకుల్లో వడ్డీ కూడా చెల్లిస్తాం

చేనేత కార్మికులకు ప్రత్యేక నిధి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగిన జన చైతన్య యాత్ర

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్‌ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రకటించారు.

అలాగే రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయడంతో పాటు ప్రతీ ఏటా వడ్డీలను కూడా ప్రభుత్వమే చెల్లిం చేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్యయాత్ర బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో లక్ష్మణ్‌ ప్రసంగించారు.

మహిళలకు అవమానం
బతుకమ్మ చీరల పేరిట సీఎం కేసీఆర్‌ నాసిరకం చీరలు పంపిణీ చేసి తెలంగాణ మహిళలను అవమానపరిచారని లక్ష్మణ్‌ విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబం ధించి దాదాపు రూ.200 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులు ఉన్నా.. ఇక్కడి వారికి పని కల్పించకుండా సూరత్‌లో చీరలను కొనుగోలు చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌లో బీసీలకు స్థానం లేదు..
కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ అనే లిమిటెడ్‌ కంపెనీలో బీసీలకు స్థానం లేదని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో కొడుకు, కూతురు, అల్లుడు తప్ప మరెవరి మాటా చెల్లుబాటు కాదన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌నేత డి.శ్రీనివాస్‌ను కూడా పార్టీలో నుంచి సాగనంపే కార్యక్రమం చేపట్టారన్నారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరులను కూడా కేసీఆర్‌ కరివేపాకులా వాడుకుని వదిలేశారని ఆరోపించారు.

60 ఏళ్లు కాంగ్రెస్‌కు, ఐదేళ్లు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వా లని కోరారు. బీజేపీకి అవకాశం ఇస్తే సమన్యాయం చేయడంతో పాటు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ సభల్లో ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నేతలు నాగూరాం నామాజీ, శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top