ముగ్గురు సీఎంల పట్టాభిషేకం

3 Congress CMs take oath of office - Sakshi

రాజస్తాన్‌లో అశోక్‌ గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌

హాజరైన రాహుల్, మన్మోహన్, ఇతర పార్టీల అధినేతలు

సోమవారం కాంగ్రెస్‌కు మిశ్రమ అనుభూతులు కలిగాయి

ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్‌ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం.

సోమవారం ఉదయం రాజస్తాన్‌ సీఎంగా అశోక్‌ గహ్లోత్‌ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్‌జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్‌ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ కొత్త సీఎం బఘేల్‌ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు.

గహ్లోత్‌ ముచ్చటగా మూడోసారి..
జైపూర్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్‌ హాల్‌లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్‌ పైలట్‌ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్‌ రికార్డు సృష్టించారు. గహ్లోత్‌ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌ ముక్తిమోర్చా నేత హేమంత్‌ సోరేన్, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా నేత బాబూలాల్‌ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.

దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్‌ హాల్‌ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం  ట్రాఫిక్‌ స్తంభించింది.

సఫా ధరించిన పైలట్‌
సచిన్‌ పైలట్‌(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్‌ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్‌..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు.


గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే


తలపాగాతో పైలట్‌

రుణమాఫీపై తొలి సంతకం
మధ్యప్రదేశ్‌ 18వ సీఎంగా కమల్‌నాథ్‌

భోపాల్‌
మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. 

పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత దినేష్‌ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూతోపాటు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్‌ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్‌ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, కైలాశ్‌ జోషి, బాబూలాల్‌గౌర్‌ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హాజరుకాలేదు.

రూ.2 లక్షల రుణమాఫీ..
ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్‌ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్‌ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజేశ్‌ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు.


భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్‌ కొత్త సీఎం కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్‌ అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ సీఎం బఘేల్‌
రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్‌ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌  నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్‌ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్‌ జునేజా ఇండోర్‌ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్‌ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్‌ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్,  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్‌ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్‌ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. 

బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌


ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు,
కమల్‌నాథ్, ఫరూక్‌ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ


అందరూ కలిసి ఒకే బస్సులో...:
గహ్లోత్‌ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్‌ పవార్, శరద్‌ యాదవ్, స్టాలిన్‌ తదితరులు


మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top