కాంగ్రెస్‌కు షాక్‌.. లిక్కర్‌ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్‌ | Ex Chhattisgarh CM Bhupesh Baghel son arrested ED By liquor scam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. లిక్కర్‌ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్‌

Jul 18 2025 1:12 PM | Updated on Jul 18 2025 2:49 PM

Ex Chhattisgarh CM Bhupesh Baghel son arrested ED By liquor scam

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో, ఆయన అరెస్ట్‌ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఆరోపించింది. 2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్‌ జిల్లాలోని భిలాయ్‌ ప్రాంతంలో గల బఘేల్‌ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.

కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్‌ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్‌ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే, ఈరోజు చైతన్య బఘేట్‌ పుట్టినరోజు కావడం విశేషం. పుట్టినరోజే ఆయనను ఇలా అరెస్ట్‌ చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అరెస్ట్‌ఫై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ స్పందిస్తూ.. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. మరోవైపు.. చైతన్య బఘేల్‌ అరెస్ట్‌ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులను.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement