కదన రంగంలోకి..

2019 General Elections Plans In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ సత్తా చా టేందుకు వారు అంది వచ్చే ఏ అవకాశాన్నీ వదలకుండా అంది పుచ్చుకుంటున్నారు. ప్రజల్లో తమ పట్టు నిలుపుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ సభలు, సమావేశాల ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ శక్తి యాప్‌ ద్వారా కార్యకర్తలను మమేకం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను తీవ్రం చేసింది. అదే విధంగా ప్రజలు, నిరుద్యోగుల సమస్యలే అజెండాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు సాగిస్తోంది. ఇంకా బీజేపీ, టీడీపీ, వామ పక్ష పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా తమ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు పట్టు ఉన్న ప్రాంతాల్లో పార్టీలను మరింత బలోపేతం చేసేందుకు వ్యూహా ప్రతివ్యూహాలను మిగతా రూపొందిస్తున్నాయి.

బలమైన నేతలపై టీఆర్‌ఎస్‌ గురి వచ్చే ఎన్నికల్లో ఓట్లు, సీట్లే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకే పాలమూరు అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు తరచుగా జిల్లా పర్యటనల ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే పాలమూరు ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ ఆశించినంతగా పుంజుకోవడం లేదని ఇంటలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుండగా... సంస్థాగతంగా బలపడేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు బూత్‌ కమిటీల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.

అలాగే ఉమ్మడి జిల్లాలో విపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, బలమైన నేతలు ఉన్న ప్రాంతాలపై అధికార పక్షం ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ స్వయంగా గద్వాలలో బహిరంగసభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. తద్వారా కాంగ్రెస్‌ పార్టీకి గద్వాలను కంచుకోటగా మలిచిన డీకే.అరుణను ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వానికి, కేసీఆర్‌ కుటుంబానికి కొరకరాని కొయ్యలా మారిన కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో టీఆర్‌ఎస్‌ చాలా సీరియస్‌గా ఉంది. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ను నిలువరించాలని అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంపై దాదాపు ఐదారు మంది మంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగా ఇటీవల కోస్గిలో ఏకంగా ముగ్గురు మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీరితో పాటు పాలమూరుకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
 
బలోపేతంపై కాంగ్రెస్‌ దృష్టి 
రాష్ట్రం మొత్తం మీద కాస్త బలంగా ఉన్న పాలమూరులో తమ సత్తా చాటి మరింత బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులు సమీకరిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలని శత విధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధిష్టానం దూతలు, రాష్ట్ర నేతలు తరచూ పాలమూరు పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలను ఉత్సాహపరిచడంతో పాటు అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు శక్తియాప్‌ ద్వారా పార్టీకి అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే విధంగా ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేసే దిశగా కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శంకరసముద్రం రిజర్వాయర్‌ సమస్యపై అఖిలపక్ష నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న వ్యక్తులు అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పర్యటనలను ఉధృతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకునేందుకు సీనియర్‌ నేతలు డీకే.అరుణ, ఎస్‌.జైపాల్‌రెడ్డి ఎవరికి వారుగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్ల అంశాన్ని ప్రస్తావించకుండా పార్టీలోకి వచ్చే వారందరినీ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో నారాయణపేట నియోజకవర్గానికి చెందిన శివకుమార్‌రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి కూడా పార్టీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం.  

ఓటు బ్యాంకు దిశగా బీజేపీ, వామపక్షాలు 
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు మాత్ర మే కాకుండా సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. గతంలో ఉమ్మడి పాలమూరు నుంచి చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించిన కమలం పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్న బీజేపీ... ఓటు బ్యాంకును పెంపొందించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఏర్పా టు చేసిన శక్తి కేంద్రాల ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కార్యాచరణ చేపట్టింది. అలాగే వామపక్ష పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యాయి. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తదితర వాటి ద్వారా ప్రజల్లో స్థానం దక్కించుకునేందుకు వామపక్ష పార్టీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఇలా మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యచరణ చేపట్టి కదన రంగంలోకి దూకినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

ప్రజల్లోకి వైఎస్సార్‌ సీపీ.. 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దివంగత ము ఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మలచు కునేందుకు వైఎస్సార్‌ సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రజల్లో పార్టీ పట్ల మరింత ఆదరణ పెంపొందించేందుకు ప్రజాసమస్యలే అజెండాగా పోరాటం చేపట్టింది. ఇటీవల నిరుద్యోగ యువత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని వివరిస్తూ ధర్నాలు, సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. ఉమ్మడి జిల్లాలోని బీస మరియమ్మ, రాంభూపాల్‌రెడ్డి, మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, జెట్టి రాజశేఖర్‌రెడ్డి, తమ్మళ్లి బాల్‌రాజ్, మందాడి సరోజ్‌రెడ్డి, తదితర నేతలు పార్టీని బలోపేతం చేయ డం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top