
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ముందస్తు అనుమతి లేకుండా జడ్జీలు, మేజిస్ట్రేట్‌లు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్‌లో తీవ్రంగా మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి గారూ, మీకు వినయంగా తెలియజేసేది ఏంటంటే.. మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. ప్రస్తుతం నడుస్తున్నది 2017 అంతేతప్ప 1817 కాదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
దీంతోపాటు ‘రాజస్తాన్ ఆర్డినెన్స్ వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకమంటున్న న్యాయ నిపుణులు’ అని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు. తాజాగా రాజస్తాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతి లభించేంతవరకు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగుల విచారణపై మీడియా ఎలాంటి వార్తలు ప్రచురించరాదు. ఈ చట్టం ప్రకారం అనుమతులు పొందడానికి 6 నెలలు పడుతుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ స్పందిస్తూ.. ఈ ఆర్డినెన్స్ ద్వారా అవినీతిపరులను రక్షించి మీడియా గొంతు నొక్కడానికి ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు.