గోవును సేవించినట్టుగా వాక్కును సేవించిన కవిత్వం...

గోవును సేవించినట్టుగా వాక్కును సేవించిన కవిత్వం... - Sakshi


నీటి రంగుల చిత్రం- వాడ్రేవు చినవీరభద్రుడి కవిత్వం

 వెల: రూ.150

 ప్రతులకు: నవోదయ, కాచిగూడ, హైదరాబాద్.


 

 ‘గోవును సేవించినట్టుగా వాక్కును సేవించాలి

 గోచర జీవితానుభవాన్ని క్షీరంగా మార్చుకోవాలి

 ప్రతి పచ్చిక బయలు వెంటా ఆవు వెనకనే నడవాలి

 నై విచ్చిన నేలల్లో కూడా ఆకుపచ్చజాడను అన్వేషించాలి’...

 పరిణితి అనే మాటకు కొలబద్ద లేదు. ఎంచే బిందువు కూడా లేదు. ప్రతి స్థలకాలాల్లోనూ అది మారిపోతూ ఉంటుంది. వాడ్రేవు చినవీరభద్రుడి నుంచి 1995లో ‘నిర్వికల్ప సంగీతం’ కవితా సంపుటి వెలువడినప్పుడు- బహుశా అప్పుడాయన తొలి యవ్వన దారుల్లో ఉండగా- ఈ వయసులో ఇంత పరిణితి ఉన్న కవిత్వమా అని అచ్చెరువొందారు పరిశీలకులు. 2004లో ‘పునర్యానం’ వెలువడినప్పుడు ఇది కదా పరిణితి అని మెచ్చుకోలుగా తలాడించారు.

 

 2009లో ‘కోకిల ప్రవేశించే కాలం’... ఆ శీర్షికతోనే కవి నడిచి వస్తున్న దారిని చూసి మురిసిపోయారు. ఇప్పుడు ‘నీటి రంగుల చిత్రం’. నీటి రంగులంటే వాటర్ కలర్స్. తడి తగిలితే తప్ప పలకని రంగులు. సుకుమారమైనవి. చేయి తిరిగిన చిత్రకారుడు వాటితో రచించిన దృశ్యచిత్రాల్లాంటివి ఈ పుస్తకంలోని పదచిత్రాలు.

 ‘రాత్రి ఆకాశమంతా పారిజాత తరువులా ఉంది’... అబ్బ... ఎంత బాగుంది. మీకు చిత్రం కనిపించడం లేదూ? ‘ ‘మా ఊళ్లో మా చిన్నప్పటి ఇంటి చుట్టూ వెదురు కంచె, దానికి రెండు తలుపులు, వీధిగుమ్మం దాటితే ఊరు, పెరటి తలుపు తెరిస్తే పాలపూల అడవి, జెండా కొండ’... పాల పూల అడవి అట. బొమ్మ కట్టలేదూ? ఇక ‘మాఘ మాసపు అడవి పొడుగూతా నిశ్శబ్దం’... వాహ్. ఆ నిశ్శబ్దం మనల్ని తాకుతుంది.

 

 ఇంతకూ ఈ పుస్తకంలో కవి ఏ నెమలికను నిమిరాడు? ఏ వాక్య సంచయానికి ఆయువు పోశాడు? ఏ పదం తాలుకు పుప్పొడి పసుపును ప్రవాహంలో వదిలిపెట్టి దిగువకు తరలించాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకమంతా ఒక తన్మయత్మపు అనుభవం. కవిదే కాదు. పాఠకుడిది కూడా. నిజంగా కవిత్వంతో దేనిని దర్శించాలి లేదా దేనిని దర్శించేటప్పుడు అది కవిత్వం అవుతుంది అని కవి నమ్మిన రెండు విషయాలకూ ఉదాహరణ ఈ పుస్తకం.

 

 వెల్లువలా విరబూసిన మామిడిపూత, దారులంతటా యువతుల తరుణదేహాల మాదక సుగంధం, తెల్లవారుజాముల్లో దిగే కమలాఫలాల గంపలు, ఎర్రగా చిగిర్చిన రావిచెట్టు, మార్గశిర మాసపు చలి, పొద్దున్నే కురుస్తున్న వసంతవాన... ఇవన్నీ ప్రయత్నం వల్ల కాదు కేవలం రెప్పపాటులోని తమ సాక్షాత్కారం వల్ల కవి చేత కలం పట్టిస్తాయి. మనసు నర్తనం ఆడుతుంది. వాక్యం కావ్యం అవుతుంది.

 

 చినవీరభద్రుడు ఈ పుస్తకంలోని కవితలను దశలు దశలుగా సంపుటీకరించారు. ‘కవిత్వం’, ‘వ్యక్తులు’, ‘రంగులు’, ‘కాంతి... మంచు... మధురిమ’, ‘పునర్ అనుభవం’... ఈ దశలన్నింటిలోనూ కవి కవిత్వాన్ని కనుగొనడం... తనను తాను కనుగొనడం కనిపిస్తుంది. కవి చెప్పుకున్నట్టుగా- జీవిత సత్యం, సౌందర్యం, జీవితానందం కోసం సాగే అన్వేషణ ఈ కవిత్వం. ‘లేగదూడ తల్లిని గుర్తు పట్టినట్టు నేనిన్నాళ్లకు ఏకాదశిని పోల్చుకున్నాను’ అనడంలోనే తాను కనుగొన్న కొత్త అన్వేషణను మనం పోల్చుకోవచ్చు. ‘ఇన్నాళ్లు తాత తండ్రుల దారి నడిచాను. ఇప్పుడు అమ్మ, అమ్మమ్మల తోవ పట్టుకున్నాను’ అనడంలో- సృష్టికీ సౌందర్య సృష్టికీ మూలమైన స్త్రీ కొనవేలునీ, ప్రకృతి చూపుడు వేలునీ పట్టుకొని ఈ కవి తదుపరి ప్రయాణాన్ని సాగించనున్నానని చెబుతున్నాడు.

 

  ఇది ఒక మౌనసరోవర స్థితి. హోరు మాని మౌనంగా పరికించడం కూడా పరిణితిలో ఒక భాగమే.

 సరళంగా కనిపిస్తూ లోతుగా స్పర్శించే నాలుగు వాక్యాలు రాయడం మాటలు కాదు. కనపడనిది వినపడాలి. వినపడనిది కనపడాలి. దేవుడా నా ప్రతిరోజునీ ఒక పద్యంగా మలుచు అని నివేదించే పరితాపం కావాలి. అప్పుడే సాధ్యం. ఈ పుస్తకం అంతా ముగించేటప్పటికి పాఠకుడికి ఒకటి అనిపిస్తుంది- ఈ కవి ఎప్పుడో ఒకప్పుడు సాహిత్యంలోకి ప్రవేశించడానికి బయలుదేరాడు. సాహిత్యమే ఇతడిగా మారిపోయిన సంయోగ స్థితిలో ఇప్పుడున్నాడు.  ఇతడు ధన్యుడు.

 - లక్ష్మీ మందల

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top