అక్షర పాలకులు

Literature And Poetry Based Rulers Editorial By Vardhelli Murali - Sakshi

రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్‌స్ట్రా క్వాలిఫికేషన్‌ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్‌ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే!

ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు.

భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్‌ షా కలం పేరు జఫర్‌. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్‌... బహదూర్‌ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్‌ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్‌ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్‌ హూం’ అనే గజల్‌ ఇప్పటికీ  కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది.

బ్రిటన్‌ ప్రధానిగా వ్యవహరించిన విన్‌స్టన్‌ చర్చిల్‌ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్‌ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్‌ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్‌ రచయితగా నోబెల్‌ బహుమతి పొందడం గమనార్హం. 
భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్‌ ఎట్‌ హార్ట్‌’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి!

చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్‌ కవులు మెచ్చిన రొమాంటిక్‌ పొయెట్‌. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్‌ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్‌ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్‌ గమాంగ్‌ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్‌ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్‌ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి.

హైదరాబాద్‌ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ నల్లగొండ జిల్లా హుజూర్‌ నగర్‌ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్‌ బెర్నార్డ్‌ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్‌ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్‌ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు.

ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top