నియంతల కాలం కాదు కదా!

నియంతల కాలం కాదు కదా! - Sakshi


డేట్‌లైన్‌ హైదరాబాద్‌అయినా సామాజిక మాధ్యమాల వల్ల జరిగే మంచిని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు గమనించకపోతే ఎలా? లోకేశ్‌ విషయమే తీసుకుందాం. ఆయన తెలుగు భాషను ఖూనీ చెయ్యడం చూడలేక సామాజిక మాధ్యమాలు వేసిన జోకుల కారణంగానే కదా ఆయన ఇవాళ ఒక ట్యూషన్‌ మాస్టర్‌ను పెట్టుకుని తన తెలుగుభాషను, ఉచ్చారణను మెరుగు పరుచుకుంటున్నారు. ఇప్పుడాయన ప్రసంగాల తీరు కొద్దిగా మెరుగు అయిందంటే సామాజిక మాధ్యమాల పుణ్యమే.పొలిటికల్‌ పంచ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎట్టకేలకు మంగళవారంనాడు అరెస్ట్‌ చేశారు. ‘ఎట్టకేలకు’ అని ఎందుకు అనాల్సివచ్చిందంటే ఆయన ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి మీద వేసిన ఒక కార్టూన్‌ను సాకుగా చూపి, అరెస్ట్‌ చేసి లోపలేసి సామాజిక మాధ్యమాన్ని మొత్తం నోరు మూయించి వేద్దాం అనుకుంటే ఆ పప్పులేమీ ఉడకవని అర్థమై, కొన్నిరోజుల పాటు ఆలోచించి చివరికి అనిత అనే అధికారపక్ష శాసనసభ్యురాలి మీద చేసిన ఒక వ్యాఖ్యను ఆధారంగా చేసుకుని ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేశారు కాబట్టి.శాసనసభ్యురాలు అనిత మీద కార్టూనిస్ట్‌ రవికిరణ్‌ గీసిన, చేసిన వ్యంగ్య చిత్రం, వ్యాఖ్య ఎట్లా దళిత, గిరిజనుల మీద జరిగే అత్యాచారాల క్రిందకు వస్తుంది అనే విషయం తరువాత చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ, దాని అధినేతకూ, అక్కడి పోలీసు వ్యవస్థకూ అసలు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి కానీ, వ్యంగ్య చిత్రాలను గురించి కానీ కనీస అవగాహన లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. సామాన్య ప్రజల గురించి ఎవరూ వ్యాఖ్యానాలు చెయ్యరు. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను గురించి వ్యాఖ్యానించకుండా ఉండరు. అది ప్రజల ప్రచార, ప్రసార సాధనాల హక్కు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రైవేట్‌ జీవితాలు వారి వారి సొంతం, పబ్లిగ్గా వస్తే∙ఏమయినా అంటాం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు వీరెప్పుడూ విని ఉండరు. ఎంతసేపూ మాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, ఏమీ రాయకూడదు అన్న అహంకార ధోరణి కారణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోతున్నారు. జర్మనీ పాలకుడు హిట్లర్‌ వ్యవహారం ఇట్లాగే ఉండేదట. చంద్రబాబునాయుడు అదే హిట్లర్‌ పుట్టినరోజునే జన్మించినందుకు ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నట్టున్నారు. కానీ ఈ రోజుల్లో అది కుదరదనే విషయం ఆయన మరిచిపోతున్నారు. తమకు వ్యతిరేకంగా రాయకుండా, మాట్లాడకుండా తెలుగు మీడియాను, ఒకటి రెండు మినహాయించి, నయాన్నో భయాన్నో దారికి తెచ్చుకున్నారు. కొన్ని పత్రికలూ, చానళ్లూ అధికార పక్షం బాకాలుగా మారి అసత్యాలను టన్నుల కొద్దీ గుమ్మరించి పాఠకులను, ప్రేక్షకులను తప్పుదారి పట్టించే పనిలో నిమగ్నమై ఉన్నాయి.అసలు తప్పిదమేమిటబ్బా!

అయితే సోషల్‌ మీడియా పేరిట ఉ«ధృతంగా, విస్తృతంగా దూసుకుపోతున్న ఒక నూతన, ప్రత్యామ్నాయ మీడియాను ఏం చెయ్యాలో, ఎట్లా నియంత్రించాలో, ఎట్లా తమ దారికి తెచ్చుకోవాలో అర్థంకాక తలలు బాదుకుంటున్న చంద్రబాబునాయుడు సర్కార్‌ ఆ గందరగోళంలో చేస్తున్న తప్పే రవికిరణ్‌ మీద ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్‌ చెయ్యడం. తప్పు చేస్తే రవికిరణ్‌ అయినా ఎవరయినా చట్టం దృష్టిలో శిక్షార్హులే. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రవికిరణ్‌ చేసిన తప్పు ఏమిటీ అన్న విషయం.పోనీ ఏదో ఒక కేసులో ఇరికించి రవికిరణ్‌కు శిక్ష పడేట్టు చేస్తే భయపడిపోయి మొత్తం సోషల్‌ మీడియా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినీ, ఆయన కుమారుడినీ, ఆ పార్టీ నాయకులనూ విమర్శించడం మానేస్తుందా? సత్యాన్ని తమదైన సృజనాత్మక రీతిలో వ్యక్తీకరించడం ఆపేస్తుందా? వందలూ, వేల సంఖ్యలో ఉన్న సామాజిక మాధ్యమాలను ఎట్లా ఆపుతారు? రవికిరణ్‌ను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీ సులు ఎత్తుకుపోయి ఒక రోజంతా నిర్బంధించి వదిలేశాక సోషల్‌ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు ఆగిపోలేదే! భారతదేశానికే సెల్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌ తెచ్చిన ఘనత తనదే అని చెప్పుకునే చంద్రబాబునాయుడు ‘తమ దాకా వస్తే వాటన్నిటినీ నిషేధిస్తా’అన్న ధోరణిలో పడిపోవడం విస్మయం కలి గించే విషయం.కక్షపూరిత చర్య

ఇక కొంతకాలంగా సోషల్‌ మీడియాను నియంత్రించడం ఎలా అన్న అంశం మీద చర్చలు చేసి, సమీక్షలు జరిపి, తలలు బద్దలు కొట్టుకుని చివరికి చేసింది ఏమిటంటే– రవికిరణ్‌ మీద అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించడం. ఇక చంద్రబాబునాయుడుకూ, ఆయన కుమారుడికీ అభ్యంతరకరంగా మారిన రవికిరణ్‌ రెండు కార్టూన్ల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనం ముందు పెద్దలకు మాత్రమే అనే బోర్డ్, దాని మీద ఇద్దరు ప్రేమికులు ముద్దుపెట్టుకుంటున్న సీను. దాన్ని చూసి లోకేశ్, ‘నాన్నా నేను పెద్దల సభకే వెళ్తాను’ అంటుంటాడు తండ్రితో. ఏ రాజకీయ అనుభవం లేకుండా నేరుగా పెద్దల సభకు వెళ్లాలనుకున్న లోకేశ్‌ మానసిక స్థితిని గురించి కార్టూనిస్ట్‌ తన భావాన్ని వ్యక్తం చేశాడు తప్ప అది శాసనమండలిని అవమానించే ఉద్దేశంతో కాదు.ఆయనను కేసులో ఇరికించాలనే హడావుడిలో అవేమీ పట్టించుకోకుండా ఒక శాసనమండలి సభ్యుడితో కౌన్సిల్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేయించి అక్రమంగా అరెస్ట్‌ చేసి ఒక రోజంతా తిప్పి ఆ కేసు నిలబడదని అర్థం అయ్యాక వదిలేశారు. దీన్ని ఎట్లా అయినా ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీకి ఆపాదించాలనే విఫల ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన మీద అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు చేసిన ఫిర్యాదును కూడా వైఎస్‌ఆర్‌సీపీకే అంటగట్టాలని ఆయన మానస పత్రిక శతవిధాలా చేస్తున్న ప్రయత్నం వంటిదే. ఆ కార్టూన్‌ ఆధారంగా రవికిరణ్‌ మీద కేసు పెట్టడం సాధ్యం కాదనుకున్న చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడూ తెలుగుదేశం శాసనసభ్యురాలు అనిత మీద వేసిన కార్టూన్‌ను వాడుకుని ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టించి మంగళవారం అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికీ, కేసులు పెట్టి వేధించడానికీ ఇటీవల కాలంలో ఈ చట్టం చాలా దురుపయోగం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా చంద్రబాబునాయుడు వంటి రాజకీయ నాయకులు ఈ చట్టాన్ని, దళిత ప్రతినిధులను తమ స్వప్రయోజనాల కోసం తరచూ వాడుకోవడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యురాలు రోజా తదితరుల మీద ప్రతి విమర్శలు చెయ్యడానికి చంద్రబాబునాయుడు తమ పార్టీ సభ్యురాలు అనితను తరచూ ప్రయోగిస్తుంటారు. అనిత లాంటి అమాయక సభ్యులు ఇట్లాంటి రాజకీయ వలలో ఇరుక్కోవడం మామూలే. రవికిరణ్‌ విషయంలో కూడా అదే జరిగింది. అనిత చేత ఆయన మీద ఈ చట్టం కింద కేసు పెట్టించారు.ఎస్సీ, ఎస్టీ చట్టం కిందికి వస్తుందా?

ఇంతకూ ఆ కార్టూన్‌లో ఏముంది? అది ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారం కిందికి వస్తుందా? చూద్దాం. నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని శాసనసభలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అనిత తరచూ చేసే వ్యాఖ్యలను ఆధారం చేసుకుని రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఇది. చంద్రబాబునాయుడి పాలనలో వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెందారు తప్ప రాష్ట్రం కాదు అని అర్థం స్ఫురించే కార్టూన్‌ అది. ఇది ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారాల కిందికి ఎట్లా వస్తుంది? ఎవరయినా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అన్న దుర్మార్గమయిన దళిత వ్యతిరేక వ్యాఖ్య చేసిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎస్సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద శిక్షార్హులు కారా? దళిత వ్యతిరేకతకు ఏ మాత్రం సంబంధంలేని రవికిరణ్‌ కార్టూన్‌ మాత్రం ఆ చట్టం కింద శిక్షార్హుడిని చేస్తుందా? అయినా పుంఖానుపుంఖాలుగా వస్తున్న సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ టెలిగ్రామ్, వెబ్‌ చానళ్లు, న్యూస్‌ వెబ్‌సైట్‌లూ లక్షలు కోట్ల సంఖ్యలో చేసే వ్యాఖ్యలనూ, వ్యక్తం చేసే అభిప్రాయాలనూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, వారి పోలీసు బలగాలు ఏ విధంగా ఆపగలుగుతారు? ఎట్లా కట్టడి చేస్తారు?అయినా సామాజిక మాధ్యమాల వల్ల జరిగే మంచిని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు గమనించకపోతే ఎలా? లోకేశ్‌ విషయమే తీసుకుందాం. ఆయన తెలుగు భాషను ఖూనీ చెయ్యడం చూడలేక సామాజిక మాధ్యమాలు వేసిన జోకుల కారణంగానే కదా ఆయన ఇవాళ ఒక ట్యూషన్‌ మాస్టర్‌ను పెట్టుకుని తన తెలుగుభాషను, ఉచ్చారణను మెరుగు పరుచుకుంటున్నారు. ఇప్పుడాయన ప్రసంగాల తీరు కొద్దిగా మెరుగు అయిందంటే సామాజిక మాధ్యమాల పుణ్యమే.మీడియా కూడా లక్ష్మణరేఖ గీసుకోవాలి

భావ ప్రకటనా స్వేచ్ఛ అపరిమితమైనదేమీ కాదు. దానికీ పరిమితులు ఉంటాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలు బాధ్యతగా వ్యవహరించాల్సిందే. అందులో సందేహం లేదు. స్వీయ నియంత్రణ పాటించాలనీ, మీడియాకు లక్ష్మణరేఖలు ఉంటాయనీ, ఆ రేఖలు దాటితే ప్రభుత్వాలూ, ఇతర వ్యవస్థలూ తాము మీడియాను నియంత్రించడానికి చట్టాల రూపంలో కత్తులూ కటార్లూ పట్టుకుని బయలుదేరితే మన స్వేచ్ఛకే నష్టం జరుగుతుందనీ స్వతంత్ర పాత్రికేయులూ, జర్నలిస్ట్‌ ఉద్యమమూ, ప్రజాస్వామ్యవాదులూ, మేధావులూ ఎంతో కాలంగా చెబుతూనే ఉన్నారు. మీడియాకు లక్ష్మణరేఖలు గీయడానికి చాక్‌పీసులు తీసుకుని బయలుదేరుతారా అని వెక్కిరింతగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కిన కొన్ని మీడియా యాజమాన్యాలూ లేకపోలేదు. ఇప్పుడు కూడా చెప్పేది ఏమిటంటే మీడియా తనకు తాను లక్ష్మణరేఖలు గీసుకోవలసిందే తప్ప, ఆదమరిచి ఉంటేæ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ వంటి వారు అనిత రూపంలో ఆయుధాలు తీసుకుని భావ ప్రకటనా స్వేచ్ఛ మీద నిరర్ధక యుద్ధం చెయ్యడానికి ఎప్పుడూ కాచుకుని ఉంటారన్న విషయం మరిచిపోవద్దు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా? లగే రహో రవికిరణ్‌!

datelinehyderabad@gmail.com

దేవులపల్లి అమర్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top