అమానుషం.. అమానవీయం!

అమానుషం.. అమానవీయం! - Sakshi


పెద్ద కులం అమ్మాయిని ప్రేమించాడని మంథనికి చెందిన మధుకర్‌ని చిత్ర హింసలు పెట్టి, మర్మాంగాలు కోసి, కళ్ళు పీకి, అవయవాలు తీసేసి అతి దారుణంగా చంపి కాలువ దగ్గర పారేసిన ఘటన ఈ మధ్యకాలంలో జరిగిన ఘోరాతి ఘోరమైన అమానుష దాడుల్లో అతి కిరాతకమైనది. ఆ హత్య చేసిన వారిపై పోలీస్‌ శాఖ ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం లేదంటే ఈ హత్య వెనక పెద్దల హస్తాలు ఉన్నట్టే. నయీమ్‌ లాంటివాడినే అంతం చేసిన పోలీసులు ఈ విషయంలో తమ సామర్థ్యాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు?.


లభ్యమైన చిత్రాల ఆధారంగా ముమ్మాటికీ అది హత్యేనని తెలుస్తున్నప్పటికీ పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసివేసే  ప్రయత్నం చేస్తు న్నారని మృతుడి కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం సోషల్‌ మీడియా ముక్త కంఠంతో వాదిస్తున్నది. ఈ ఫ్రెండ్లీ పోలీస్‌ ఎవరితో ఫ్రెండ్షిప్‌ చేస్తున్నది! ప్రజలతోనా? నేరస్తులతోనా? అంటూ సామాన్యులు సైతం సోషల్‌ మీడి యాలో నిలదీస్తున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నోరువిప్పకపోవడం వెనక మతలబు ఏంటో అని పలు అనుమా నాలు తలెత్తుతున్నాయి.


తెలంగాణ నగరాలలో గంగజా మున తహజీబ్,  కులమతాలకు అతీ తంగా గ్రామాలలో వరసలు పెట్టుకొని పలకరించుకునే సంస్కృతి ఎటు మాయ మైపోతున్నది? ఇరువురిS మధ్య ప్రేమ కలగడం మనుషుల్లోనే కాదు ప్రతి ప్రాణికీ సహజ గుణం. కుల మత  సామాజిక ఆర్థిక అసమానతల వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. శిరీషను ప్రేమించినందుకే మధుకర్‌ని ఇంత ఘోరంగా హత మార్చడం అంటే ఎంత క్రూర మనస్తత్వాలున్న మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం? అన్నిం టికీ తెగించి శిరీష తాను మధుకర్‌ని ప్రేమించిన విషయం తన తల్లిదండ్రు లకు చెప్పగలిగింది. చివరికి మధుకర్‌ పార్థివ దేహం ఎక్కడున్నదో ఆసుపత్రి పడకపై ఉండి కూడా చెప్పి తన ప్రేమను కొనసాగించే ప్రయత్నం చేసింది.


స్వతంత్రం వచ్చిన సమయంలో కుల నిర్మూలన కోసం సదస్సులు జరి గేవి. సమానత్వానికి, ఐకమత్యానికి ప్రతి మేధావి పాటుపడేవాడు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేవారు. వాటి వల్ల సమాజంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అంటరానితనం ఎన్నోచోట్ల అంతమైంది, ఇన్నేళ్ల తర్వాత పాత ఫ్యూడల్‌ వ్యవస్థను పునరావృతం చేసే ఘటనలు పదే పదే జరగటం సమా జానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం నేరస్తులను శిక్షించే చర్యలు చేపట్టడం ఒక ఎల్తైతే, కులాతీత చైత న్యాన్ని కుటుంబాల్లో పెంచే ప్రయత్నం చేయడం మరొక ఎత్తు. ఇప్పుడు జరగాల్సిన సాంస్కృతిక విప్లవం ఇదే.

-సయ్యద్‌ రఫీ, చిత్ర దర్శకుడు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top