అరచేతిలో అమరావతి

అరచేతిలో అమరావతి - Sakshi


శ్రీరమణ

 

 చంద్రబాబు తన జీవితంలో ఎన్నో ఆలోచనల్ని చురుగ్గా పెట్టుబడిలోకి మార్చుకున్న ధీశాలి. మద్యంతో బండిని కుదుపుల్లేకుండా నడపొచ్చని ఆలోచన చేసింది ఆయనే. మనకి వెంకటేశ్వరస్వామి గొప్ప అండదండ. తరుగులు

 పోకుండా వస్తే శ్రీవారి ఆదాయం రాష్ట్ర ఆదాయానికి సరితూగుతుంది.

 

 నవ్యాంధ్ర ముఖ్యపట్టణం పేరు ఖాయం చేసేశారు. పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటా రు. కాళిదాసు మేఘసందేశం లో అలకాపురిని వర్ణించి వర్ణిం చి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు.

 ఒకవైపు మిషన్ కాకతీయ అంటూ చెరువుల మీద పడ్డారు. ఇటువైపు కూడా కాకతీయ వైభవాన్ని పునరు ద్ధరిస్తామని చంద్రబాబు, ఆయన సహచరులు కంకణ ధారులైనారు. ‘నాడా దొరికింది, ఇహ కావల్సింది గుర్రం మాత్రమే’నని కొందరు నిరాశావాదులు పెదవి విరుస్తున్నారు. ‘శేషమ్మ మేడ చందంగా ఉంది’ అన్నా డొక పెద్దాయన. ‘ఎవరా శేషమ్మ? ఏమా కథ?’ అని ప్రాధేయపడ్డాను. అయ్యో! ఆవిడిది మీ ప్రాంతమే. మీకు తెలియదా అంటూ మూడు ముక్కల్లో కథ చెప్పా డు. శేషమ్మకి బోలెడు ఆస్తి ఉంది కాని అదంతా వ్యాజ్యం లో చిక్కుపడి ఉంది. ఆవిడ తీవ్ర ఆశావాది. అందుకని వ్యాజ్యం తేలగానే కట్టే మేడ గురించి ఆమె అందరికీ వివరంగా చెబుతుండేది. మెట్ల మీద నిలబడి కోడలు తలారపోసుకునే దృశ్యాన్ని, డాబా మీంచి మనవడికి చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించే ముచ్చట్లని చెప్పేది. ఇరుగు పొరుగు వారు కూడా పై డాబా మీద ఉప్పులు పప్పులు హాయిగా ఎండ పెట్టుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చేది. ప్రతిసారీ కొత్త కొత్త ఊహలు కలుస్తూ ఉండేవి. అందుకని ఊరి వారు కాలక్షేపం కావాలనుకుంటే శేషమ్మ గారికి కీయిచ్చేవారు. ప్రతిసారీ కొత్త సంగతులు ఉండడం వల్ల వినవేడుకగా ఉండేది. వ్యాజ్యం నడుస్తూ ఉండగానే శేషమ్మ నడవడం మానేసింది. అక్కడ వాయిదాలు పడుతున్నా, ఇక్కడ సమవర్తి దగ్గర వాయిదా పడలేదు. ఏళ్ల తరబడి మేడ ముచ్చట్లు విన్న ఊరి వారికి ఇదొక సామెతగా గుర్తుండి పోయింది. ఆ మాటకొస్తే ‘నవ్విన నాపచేను పండు తుంద’ని కూడా సామెత ఉంది. చంద్రబాబు పరమ ఆశావాది. ఆ వాదమే ఆయనని ఇంతదూరం నడిపించింది.




 మొన్నామధ్య చంద్రబాబు ఉన్నట్టుండి ‘ఆలోచనే పెట్టుబడి’ అని ఒక సందేశం విసిరారు. ‘ఇన్నాళ్లూ మనకి తట్టలేదు. ఎంత జడ్డి బుర్రలం’ అని రాష్ట్ర మేధావులు తలలు వంచుకుని బాధపడ్డారు. విద్యుచ్ఛక్తిని కని పెట్టడం ఒక ఆలోచన. మరి ఆ ఒక్క ఆలోచన ఎన్ని లక్షల కోట్లని జనరేట్ చేస్తోందో చూడండి! చంద్రబాబు తన జీవితంలో ఎన్నో ఆలోచనల్ని చురుగ్గా పెట్టు బడిలోకి మార్చుకున్న ధీశాలి.

 

 మద్యంతో బండిని కుదుపుల్లేకుండా నడపొచ్చని ఆలోచన చేసింది ఆయనే. మనకి వెంకటేశ్వరస్వామి గొప్ప అండ దండ. తరుగులు పోకుండా వస్తే శ్రీవారి ఆదాయం రాష్ట్ర ఆదాయానికి సరితూగుతుంది. ఇక మీద యాత్రికులకి వైద్య పరీక్షలు, వైద్యసేవలు స్వామి సొమ్ముతో చేయిస్తే ఉభయ తారకంగా ఉంటుందనే ఆలోచన వినిపించింది. నిధులు శ్రీవారివి, పేరు శ్రీస ర్కారుది. కావాలంటే ‘ఆరోగ్య గోవిందం’తో క్రెడిట్స్ గోవిందుడికే ఇవ్వొచ్చు. రేపు అమరావతిలో కూడా ఒక కొత్త దేవుణ్ణి ప్రతిష్టిస్తే, ఆ దేవుడు క్లిక్ అయితే మంచి ఆదాయం కదా! అంతర్జాతీయస్థాయి దేవుడై ఉండాలి. కావాలంటే పబ్లిక్ ప్రైవేటు పంథాలోనే సాగించవచ్చు. దీని మీద ఆర్థికవేత్తలు, మేధావులు, స్వామీజీలు విలు వైన సూచనలిచ్చి అమరావతిని కుబేరపురి చేయాలని ప్రార్థిస్తున్నా.

 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)


 


 


 




 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top