కూతుర్ని నిర్లక్ష్యం చేశారు.. జైలుకెళ్లారు

In USA Tamilnadu Couple Arrested For Neglecting Their Child Today Get Bail - Sakshi

వాషింగ్టన్‌ : తమ ఆరు నెలల చిన్నారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారనే నేపంతో అరెస్టయిన భారతీయ దంపతులకు అమెరికా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వివారాలు.. తమిళనాడుకు చెందిన ప్రకాశ్‌ సెట్టు, మాలా పన్నీర్‌సెల్వం  కొన్ని ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తమ 6 నెలల చిన్నారి హిమిషాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఫ్లోరిడాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు హిమిషాకు చేయాల్సిన చెకప్‌ల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాటి ఖరీదు ఎక్కువ ఉండటంతో హిమిషా తల్లిదండ్రులు సదరు టెస్ట్‌లు చేపించకుండానే తమ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు.

దాంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం హిమిషా తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన దేశంలో అయితే కన్నవారిని, కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను పట్టించుకోకపోవడం పెద్ద వింత కాదు.. నేరం అంతకంటే కాదు. కానీ అమెరికాలాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి పనులు చేస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హిమిషాకు వైద్య పరీక్షలు చేయడానికి నిరాకరించిన ఆమె తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయడమే కాక వారిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ సంఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది. నేడు హిమిషా తల్లిదండ్రులకు కోర్టు 30 వేల డాలర్ల పూచికత్తు మీద బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సొమ్ము చెల్లించేంత వరకూ వారు తమ పిల్లలను చూడటానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హిమిషా, ఆమె కవల సోదరుడు ఇద్దరూ చైల్డ్‌ ప్రొటక్షన్‌ అధికారులు సంరక్షణలో ఉన్నారు.

ఈ విషయం గురించి హిమిషా అమ్మమ్మ తల్లిబిడ్డలను వేరు చేయడం మహా పాపం అంటూ విమర్శించారు. వైద్య పరీక్షలకు ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి రావడం.. అంత మొత్తానికి ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లేకపోవడం వల్లే నా కూతురు, అల్లుడు హిమిషాను ఆస్పత్రి నుంచి తీసుకోచ్చారు. ఇప్పుడు బెయిల్‌ లభించినా కూడా దాదాపు 22 లక్షల రూపాయలు కట్టాలని ఆదేశించారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. అందుకే విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top