
డాలస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), నాట్స్ సంయుక్తంగా ట్యాక్స్ అండ్ ఎస్టేట్ సదస్సు నిర్వహించింది. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా బిజినెస్, మెంబర్ సర్వీసెస్ సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ సభను ప్రారంభించి అందరికి స్వాగతం పలికారు. అనంతరం టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు.
2018 సంవత్సరం నుండి ట్యాక్స్ చట్టాల్లో వచ్చిన మార్పులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఏ మురళి వివరించారు. ఈ సంవత్సరపు గడువు, ఎఫ్‌బీఏఆర్, ఎఫ్‌ఏటీసీఏ చట్టాలు, న్యాయబద్దంగా ట్యాక్సు డబ్బులు ఆదా చేసే పద్దతులను తెలిపారు. అలాగే వాణిజ్య సంస్థలు ట్యాక్స్ డబ్బులు ఆదా చేసే మరికొన్ని పద్ధతులు సోదాహరణంగా పేర్కొన్నారు.
ఆర్థికరంగా నిపుణులు తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశం, అమెరికా దేశాల చట్టాలలో ముఖ్యంగా మరణానంతర ఆస్తుల సంక్రమణంలో తేడాలు వివరిస్తూ ఎస్టేట్ ప్లానింగ్ ప్రాముఖ్యతను, అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే డబ్బులు ఆదా చెయ్యాల్సిన అవసరం, పిల్లల కాలేజీల ఖర్చులు, ఉద్యోగ విరమణానంతర జీవితానికి సంబంధించి ఖర్చులు వాటిని సమర్థంగా ఎదుర్కొనడానికి అవలంభించాల్సిన ప్రణాళికలను వాటికి తన సంస్థ చేయగలిగిన సహాయాన్ని వివరించారు.
ముఖ్యఅతిథులు మురళి, తిరుమల్ రెడ్డిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి , ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, కోశాధికారి శరత్ రెడ్డి యర్రం, సతీష్ బండారు, సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ మురళి, తిరుమల్ రెడ్డిల కమ్యూనిటీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.