టాంటెక్స్ వేదికపై 'మహిళ నాడు - నేడు' | TANTEX conducts 123rd sahithya vedika in Dallas | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ వేదికపై 'మహిళ నాడు - నేడు'

Nov 1 2017 9:20 PM | Updated on Nov 1 2017 9:30 PM

TANTEX conducts 123rd sahithya vedika in Dallas - Sakshi

డాలస్, టెక్సాస్‌ : ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన "నెల నెలా తెలుగు వెన్నెల" సదస్సును నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 123 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులను టాంటెక్స్ నిర్వహించింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు. కార్యక్రమంలో లాస్య సుధ డాన్స్ అకాడమీ డా. కలవగుంట సుధ శిష్యులు ప్రార్థనా గీతం ఆలపించారు. డా.  బల్లూరి ఉమాదేవి 123వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘మహిళ నాడు - నేడు , వేమన దృష్టిలో మహిళ’ అనే అంశము పై ప్రసంగిస్తూ, గృహనిర్వహణతో పాటూ దేశప్రగతిలోను మహిళలు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. వేదకాలంలోని గార్గి మొదలుకొని నేటి కాలం దాక మహిళ సాధించిన విజయాలను వివరించారు. అందుకే మాతృదేవోభవ అంటూ తల్లికి మొదటిస్థానమిచ్చారు. రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ, ఇందిరా గాంధీ, విక్టోరియా రాణి, మార్గరేట్ థాచర్ ఇలా ఎందరో మహిళలు సాధించిన ప్రగతిని వివరించారు. వేమన మహిళలకిచ్చిన గౌరవాదరాలను విశదీకరించడంతో పాటూ స్వయంగా మహిళలపై వ్రాసిన పద్యాలను కవితలను చదివి వినిపించారు.

తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గురించి మాసానికో మహనీయుడు ('మామ') అనే శీర్షికలో భాగంగా తోటకూర పల్లవి ఆహూతులకు తెలియజేశారు. సంస్థ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ కార్యక్రమంలో ప్రేక్షకులను కూడా పాల్గొనేట్టు చేసి ఎంతో ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు.
 
రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రలోని పద్యాలను జువ్వాడి రమణ వినిపించారు. అనంతరం యీరం ఖాన్  ‘మురిపాల ముకుందా సరదాల సనంద' అనే పాట పై చక్కటి నృత్యం చేసి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. ముక్కు తిమ్మన పారిజాతాపహరణములో సత్యభామ తన కోపాన్ని ఏ విధంగా చూపించిందో అనే ఘట్టాన్ని ఉదాహరణగా తీసుకుని స్త్రీల బలానికి కోపము ప్రధాన మని "మాసిన చీర గట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై"అన్న పద్యాన్ని ఆచార్య పుదూ‍ర్ జగదీశ్వరన్ శ్రోతలకు వినిపించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి ‘అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం’ లాంటి మధురమైన సినిమా గీతాలను తమ అధ్భుత గాత్రంతో ఆలపించి సభను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ అందమె ఆనందం, మనసున మనసై పాటల సాహిత్యం, పోతన, కొడాలి సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావుల పద్యాలు కొన్ని చక్కగా విశ్లేషించారు.

ముఖ్య అతిథి డా. బల్లూరి ఉమాదేవిని టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, పాలక మండలి సభ్యులు కన్నెగంటి చంద్రశేఖర్ శాలువాతో, కార్యక్రమ సమన్వయకర్త సింగిరెడ్డి శారద, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, జయ తెలకపల్లి, శశి రెడ్డి కర్రి, పల్లవి తోటకూర తదితరులు పాల్గొన్నారు. సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement