అమెరికాలో వివాహిత ఆత్మహత్య  | Sakshi
Sakshi News home page

అమెరికాలో వివాహిత ఆత్మహత్య 

Published Sun, Apr 7 2019 4:07 AM

Married women suicide in America  - Sakshi

తొర్రూరు రూరల్‌: కొత్త జీవితంపై కోటి ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఓ అభాగ్యురాలికి ఆది నుంచే వరకట్న వేధింపులు మొదలయ్యా యి. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన సేగ్యం మహేందర్, విమల దంపతుల ఆఖరి సంతానం సంధ్య (24) బీటెక్‌ చదువు కుంది. ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధాన్ని కుదిర్చారు. కానీ తొర్రూరులోని సాయినగర్‌కు చెందిన జోకుంట్ల రాజేశ్వర్, విజ య దంపతుల కుమారుడు శ్రీకాంత్‌... సంధ్యను వివాహం చేసుకుంటానని ఒత్తిడి తేవడంతో గతంలో కుదిర్చిన సంబంధాన్ని కాదని శ్రీకాంత్‌కు ఇచ్చి గతేడాది మే నెలలో వివాహం జరిపించారు. కట్న కానుకలు ఏమి వద్దని నమ్మబలికి సాదాసీదాగా మహబూబాబాద్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంధ్యను వివాహం చేసుకోవడంతో ఆదర్శభావాలుగల అల్లుడు దొరికాడని అమ్మా యి తల్లిదండ్రులు సంబరపడ్డారు.

ప్రస్తుతం శ్రీకాంత్‌ అమెరికాలోని టెన్నిసీలో రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వివాహం అనంతరం అల్లుడితోపాటు కూతురును అమెరికాకు సాగనంపారు. ఇప్పుడు వారు మెంఫిస్‌ నగరంలో నివాసముంటున్నారు. అయితే వివా హమైన కొన్ని నెలల నుంచే భర్త, అత్తమామల నుంచి వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. తల్లిదండ్రులను బాధ పెట్టొద్దని భావించి సంధ్య ఆ విషయాన్ని వారికి చెప్పలేదు. ఇంతలో వేధింపులు తీవ్రం కాగా.. సంధ్య శనివారం స్నానాల గదిలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తామామల వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని సంధ్య తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తొర్రూరు ఎస్సై నగేష్‌ తెలిపారు.  

అమెరికా కాన్సులేట్‌తో మాట్లాడిన కేటీఆర్‌ 
తమ కూతురు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని సంధ్య తల్లిదండ్రులు పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాతో చర్చించారు. బుధవారంలోగా మృతదేహాన్ని  తీసుకొచ్చేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement