కన్నీళ్ల మూటతో..

Labour Relief From J And P Company Saudi arabia - Sakshi

సౌదీ నుంచి స్వస్థలాలకు చేరిన కార్మికులు

తమవాళ్లు సురక్షితంగా వచ్చినందుకు

హర్షం వ్యక్తంచేస్తున్న కుటుంబీకులు

ఎడారి దేశంలో కష్టాలను వివరించిన రాష్ట్ర వాసులు

ప్రభుత్వం పునరావాసం కల్పించాలని వేడుకోలు

సాక్షి, నెట్‌వర్క్‌: సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ యాజమాన్యం కారణంగా తీవ్ర అవస్థలు పడిన కార్మికులకు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. వేతనాలను చెల్లించకపోవడం.. ఒప్పందం ప్రకారం పని కల్పించకుండా క్యాంపులకే పరిమితం చేయడంతో కార్మికులు అల్లాడిపోయారు. విదేశాంగ శాఖ సహకారంతో లేబర్‌ కోర్టులో న్యాయ పోరాటం సాగించి విముక్తి పొందారు. ఇటీవలే 39 మంది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు సౌదీ అరేబియా నుంచి వారి ఇళ్లకు చేరుకున్నారు. అక్కడ వారు అనుభవించిన కష్టాలను ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న వలస కార్మికుల విన్నపాలు వారి మాటల్లోనే...

ఉపాధి చూపాలి
నందిపేట్‌: సౌ§దీ అరేబియాలో జేఅండ్‌పీ కంపెనీ మోసం చేయడం వల్ల తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఎందరో నష్టపోయారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇళ్లకు చేరుకున్న మాకు ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలి. చేసిన పనికి వేతనం రాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరుకున్నాం. మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. నేను కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశాను. జేఅండ్‌పీ కంపెనీకి 60 ఏళ్ల చరిత్ర ఉంది. కంపెనీ మమ్మల్ని ముంచుతుందని ఊహించలేకపోయాం. ఆరు నెలల పాటు వేతనాలు ఇవ్వకున్నా ఓపిక పట్టాం. ఎనిమిది నెలలు పని చూపకున్నా పడి ఉన్నాం. కనీసం ఇంటికి పంపించడానికి కూడా కంపెనీ మాపై మానవత్వం చూపలేదు. విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇళ్లకు చేరుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించాలి. లేదా ఏదో ఒక ఉద్యోగం చూపితే ఇక్కడే ఉండి కుటుంబాన్ని సాదుకుంటాం. సౌదీ నుంచి తిరిగి వచ్చిన వారిలో అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు.   – బాపురావు, మారంపల్లి,నందిపేట్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా

భార్యా పిల్లలను చూస్తాననుకోలేదు
గొల్లపల్లి: మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి రూ.8 లక్షల వరకు అప్పు చేసిన.   చేసిన అప్పులు తీర్చడం కోసం సౌదీ వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో రూ.1.50 లక్షలు పెట్టి ముంబై లోని ఏజెంట్‌ ద్వారా వెళ్లాను. అక్కడ జేఅండ్‌పీ కంపెనీలో 14 నెలలుగా క్యూయూసీ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ డాక్యుమెంట్‌ కంట్రోలర్‌గా పనిచేశాను. అయితే, కంపెనీ ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు. వేతనాలు ఇవ్వకుండా సకాలంలో అకామా(గుర్తింపు) రెన్యూవల్‌ చేయకుండా కార్మికుల పట్ల మొండివైఖరి అవలంభించింది. నాలాంటి వందల మంది కార్మికులు కంపెనీ క్యాంపునకే పరిమితమై రోజులు వెల్లదీసారు. అక్టోబర్‌ నుంచి పనులు చూపలేదు. మాకు గోస మొదలైంది. చీకటి గదుల్లో గడిపాము. తిండి, నీళ్లు కనీసం వసతులు లేక అవస్థలు పడ్డాం. పాస్‌పోర్టులు లాగేసుకుని నిర్బంధించారు. పాసుపోర్టు దగ్గరలేకపోవడంతో పోలీసులు అరెస్టు చేస్తారని భయపడ్డాం. నిత్యం నరకం అనుభవిస్తూ బతికాం. మానసిక వేదనతో నా తోటి కార్మికులు శ్రీలంకకు చెందిన అశోక్, చెన్నైకి చెందిన రత్నం గుండెనొప్పితో చనిపోయారు. ఇంకా ఎంతో మంది కార్మికులు మానసిక వేదనకు గురై అనారోగ్యం పాలయ్యారు.   మమ్మల్ని ఎలాగైనా మా దేశానికి తీసుకెళ్లండని అయినవారికి ఫోన్లు చేశాం. పత్రికల వాళ్లకు మా గోస తెలిపాం. వారు మా గోసకు స్పందించి కథనాలు రాసారు. వారి పుణ్యమా అని సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ అధికారులు కార్మికులతో మాట్లాడారు. సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్‌ మన దేశ కార్మికులతో మాట్లాడారు. భారతీయ కార్మికులను క్షేమంగా ఇంటికి పంపిస్తారని మాటిచ్చారు. పనిచేయించుకుని వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో క్షేమంగా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. భార్యా పిల్లలను చూస్తానని అనుకోలేదు. మేము పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నా. అప్పుల ఊబిలో కూరుకు పోయిన కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పునరావాసం కింద ఆదుకోవాలి.

అప్పులే మిగిలాయి..
చందుర్తి (వేములవాడ): నేను గల్ఫ్‌కు వెళ్లేందుకు ముందు గ్రామంలో కూలీ పని చేసేవాడిని. వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకే సరిపోవడం లేదని గల్ఫ్‌ బాట ఎంచుకున్నా. 1997లో రూ.80వేల అప్పు చేసి సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ అనే నిర్మాణ కంపేనీలో పనిచేసేందుకు వెళ్లాను. అప్పుడు కంపేనీ 12గంటల పనిచేస్తే ఇండియా కరెన్సీలో రూ.4వేలు  దొరికేవి. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు కంపెనీ చాలీచాలని వేతనాలిచ్చింది. సౌదీ వెళ్లేందుకు చేసి బాకీ తీర్చేందుకు ఐదేళ్లు పట్టింది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారుల పోషణకు పంపిన డబ్బులు సరిపోక నా భార్య గ్రామంలో అప్పు చేసింది. గ్రామ శివారులో ఎకరం వ్యవసాయ భూమి ఉంటే రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. ప్రభుత్వం అందించిన పరిహారంతో పాటు మరో రూ.3లక్షల అప్పు చేసి రెండేళ్ల క్రితం పెద్ద కూతురు వివాహం చేశాం. కొన్ని రోజుల తర్వాత కంపెనీ యాజమాన్యం వేరే వాళ్లకు విక్రయించింది. రెండు నెలల పాటు వేతనాలు ఇక్కడి కరెన్సీలో రూ.20వేల చొప్పున ఇచ్చి పనిచేయించుకుంది. తరువాత ఆరు నెలల పాటు వేతనాలు చెల్లించకపోవడంతో పనిలేక 8 మాసాల పాటు రూంలోనే ఉండి పోయాం. మా కష్టాలను కేటీఆర్‌కు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాం. ఇండియన్‌ ఎంబసీ సహకారంతో సౌదీ లేబర్‌ కోర్టు ఎగ్జిట్‌ వీసాలను, టికెట్లను కొనిచ్చి ఇండియాకు పంపించింది. అప్పులను మూటగట్టుకుని స్వగ్రామానికి చేరుకున్నాం. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదు. మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.–మల్యాల, చందుర్తి మండలం,రాజన్నసిరిసిల్ల జిల్లా

జీతం ఇవ్వలే..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన అలకుంట రవి 2015లో కామారెడ్డిలోని ఓ ఏజెంట్‌ ద్వారా సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడి నిర్మాణాలకు లేబర్‌ను సప్లయ్‌ చేసే జేఅండ్‌పీ కంపెనీ పేరుమీద వీసా ఇచ్చారు. రూ.లక్ష చెల్లించి  వెళ్లిన రవి ఆ కంపెనీలో యేడాది పాటు పనిచేశాడు. ఆ తరువాత యేడాది పనిచేసినా డబ్బులు సక్రమంగా ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత కంపెనీ మూతపడింది. అప్పటి నుంచి కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కంపెనీ వీసా మీద వచ్చిన కార్మికులు సదరు కంపెనీలో తప్ప మరోచోట పనిచేయడానికి వీలు లేదు. రవి పనిచేసిన కంపెనీ ఎత్తివేయడంతో తోటి వారితో కలిసి క్యాంపులోని గదికే పరిమితం కావాల్సి వచ్చింది. కనీసం తిండికి లేక ఎన్నో రోజులు పస్తులు ఉన్నామని రవి చెప్పాడు. ఒక్కోసారి దొంగచాటుగా బయటకు వెళ్లి పని వెతుక్కుంటూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునేవారమని తెలిపాడు. మరోచోట పనిచేస్తూ పట్టుబడిన వారిని కొంతకాలం జైలులో ఉంచిన తర్వాత పోలీసులు తిరిగి క్యాంపులోకి పంపేవారని చెప్పాడు. బాధితులు తమ సమస్యను సోషల్‌మీడియా ద్వారా ఇండియన్‌ ఎంబసీ, భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో అధికారులు స్పందించి 39 మందిని స్వదేశానికి పంపాలని అక్కడి లేబర్‌ కోర్టుకు అప్పీలు చేశారు. ఇండియన్‌ ఎంబసీ అధికారుల చొరవతో మొత్తం 39 మంది తెలుగు కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, గల్ఫ్‌ వెళ్లేందుకు చేసిన అప్పులు పెరిగి ప్రస్తుతం రూ.4 లక్షలు అయ్యాయని రవి తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

సంవత్సర కాలం నరకం అనుభవించా..

జగిత్యాల క్రైం: ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్తే అక్కడ కంపెనీ దివాళాతీయడంతో సంవత్సర కాలం పని దొరకలేదు. ఆరు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో పాటు 8 సంవత్సరాలు కంపెనీలో చేసినా స్టైఫండ్‌ ఇవ్వకుండా కంపెనీ మోసం చేసింది. స్వదేశం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే వారి సహాయంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నా.– దర్శనాల మల్లయ్య, నక్కలపేట, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా

పనిలేక పస్తులున్నా..
జగిత్యాల క్రైం: ఎనిమిది సంవత్సరాలు సౌదీలో జేఅండ్‌పీ కంపెనీలో లేబర్‌గా పనిచేశాను. గత సంవత్సర కాలం నుంచి కంపెనీ దివాళా తీయడంతో మాకు 14 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో పాటు ఉన్న రూముల్లో కూడా విద్యుత్, నీటి వసతి కల్పించలేదు. అప్పులు చేసి పొట్టగడుపుకున్నాం. కొన్ని రోజులు పస్తులున్నాం. ఇంటికి వచ్చేందుకు కూడా కంపెనీ టికెట్లు ఇవ్వలేదు. సౌదీ లేబర్‌ కోర్టు టికెట్లు ఇవ్వడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉపాధి చూపాలి.– దీటి మల్లేశం, రేచపల్లి,సారంగాపూర్‌ మండలం, జగిత్యాల జిల్లా

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top