ఉపాధి మూత

Economic crisis in Gulf Countries - Sakshi

గల్ఫ్‌ దేశాల్లో ఆర్థిక సంక్షోభం

క్రమంగా మూతపడుతున్న కంపెనీలు

ఉపాధి కోల్పోతున్న కార్మికులు

స్వదేశానికి వస్తున్న కార్మికులకు

పునరావాసం చూపాలని పలువురి డిమాండ్‌

ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారానే ప్రవాసులకు ప్రయోజనం

గల్ఫ్‌ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో అనేక మంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. గల్ఫ్‌లో కొంత కాలం నుంచి సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా వలస కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో కొన్ని కంపెనీలు మూతబడగా.. అనేక కంపెనీలు దశలవారీగా తమ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నాయి. ఎప్పటికైనా ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోతాయా తమ జీవన స్థితిగతులు మారకపోతాయా అని నమ్మిన కొంత మంది కార్మికులు మొండి ధైర్యంతో సౌదీలోనే ఉండిపోయారు.

ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కార్మికులు ఇంటికి చేరుకోక తప్పడం లేదు. అలాగే ఒమన్, కువైట్, ఇరాక్‌ దేశాల్లోనూ కంపెనీలు దివాళా స్థితికి చేరుకుంటుండటంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ఇంటిదారిపడుతు న్నారు. చమురు ధరలు తగ్గిపోవడం గల్ఫ్‌ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సౌదీ, ఒమన్, కువైట్‌ తదితర దేశాల్లో ఆ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృపరచాలని అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో వలస కార్మికుల ఉపాధికి గండిపడుతుంది. అలాగే ఏదో ఒక దేశంలో ప్రతి ఏటా ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) ప్రకటిస్తున్నాయి. ఆమ్నెస్టీ వల్ల అకామా, వీసా లేనివారు సొంత దేశాలకు వెళ్లడానికి సులభమైన మార్గం కలుగుతుంది. ఆమ్నెస్టీ అమలు చేయడానికి ఆర్థిక సంక్షోభం కూడా ఒక కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానూ అనేక మంది కార్మికులు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటి ముఖం పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా)

కేరళ తరహాలోపునరావాసం కల్పించాలి
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడ పరిస్థితులు బాగాలేక  ఇంటి ముఖం పట్టిన కార్మికుల సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలో పునరావాస చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్వగ్రామాలకు వచ్చిన తరువాత పునరావాసం లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పోషణ భారం కావడంతో కొందరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రవాస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లేదా వేర్వేరుగా పునరావాసం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వలస కార్మికుల జీవన స్థితి గతులపై పరిశోధన చేసిన మేధావులు వెల్లడిస్తున్నారు.  ప్రవాస కార్మికుల పునరావాసం కోసం ఏర్పాటు చేసే సంస్థ శాశ్వత ప్రాతిపదికన పనిచేసేదిగా ఉండాలని సూచిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫ్‌ నుంచి తిరిగి వస్తే వారికి పునరావాసం కల్పించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. కార్మికులు గల్ఫ్‌ దేశంలో పొందిన నైపుణ్యాన్ని కేరళ ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

ఒక వేళ నేరుగా కార్మికుల నైపుణ్యాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకపోతే వారికి రాయితీపై రుణాలు అందించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం కేరళ ప్రభుత్వం ప్రవాసుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే. అలాంటి మంత్రిత్వ శాఖను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు.

నైపుణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళుతున్న కార్మికులు ఇక్కడ ఎలాంటి నైపుణ్యం సంపాదించుకోకపోయినా ఆ దేశాలకు వెళ్లిన తరువాత కొంత నైపుణ్యం సాధిస్తున్నారు. గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చిన కార్మికుల నైపుణ్యాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతే.. కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. వారికి పునరావాసంతో పాటు పునరేకీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

పునరావాస చర్యలు అవసరం
ప్రవాస కార్మికులకు పునరావాస చర్యలు ఎంతో అవసరం. స్వదేశంలో ఉపాధి లేకనే పొరుగు దేశాలకు.. ప్రధానంగా గల్ఫ్‌ దేశాలకు వలసపోతున్నారు. ఆ దేశాల్లో పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రతి ఏటా ఇంటికి చేరుకుంటున్న ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సందర్బంలో కార్మికులకు మన ప్రభుత్వం ఉపాధి చూపాల్సిన అవసరం ఉంది. పునరావాస చర్యల ద్వారానే ప్రవాస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. అలాగే ప్రవాస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.– ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ,విదేశీ వలసల పరిశోధకుడు

స్వదేశంలో ఉపాధి చూపాలి
విదేశాల నుంచి సొంత గ్రామానికి తిరిగి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం స్వదేశంలో ఉపాధి చూపాలి. ఎంతో మంది కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో స్వదేశానికి తిరిగి చేరుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా సమా జంలో చులకన భావానికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటే స్వదేశానికి వచ్చే ప్రవాస కార్మికులు మానసికంగా ధైర్యంగా ఉంటారు.     – నాగిరెడ్డి ప్రశాంతి,సౌమ్య ట్రావెల్‌ బ్యూరోనిర్వాహకురాలు

రాయితీ రుణాలు ఇవ్వాలి
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధికి నోచుకోకుండా సొంత దేశానికి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. రుణాలు ఇవ్వడం వల్ల కార్మికులపై ఆర్థిక భారం తప్పుతుంది. ఫలితంగా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రవాస కార్మికులకు ఉపాధి చూపడం లేదా రాయితీ రుణాలు ఇవ్వడం వల్ల వారు సొంతంగా ఉపాధి చూసుకునే అవకాశం ఉంటుంది.   – జక్కుల చంద్రశేఖర్,సర్పంచ్‌ భూపతిపూర్‌(ఒమన్‌ రిటర్నీ)

పునరావాసం కల్పించడంప్రభుత్వ బాధ్యత
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఉద్యోగాలు కోల్పోతున్నవారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. విదేశాల్లో ఉపాధి కరువై గత్యంతరం లేక స్వదేశానికి చేరుకున్నవారికి ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. స్వదేశంలో ఉపాధి చూపించకపోతే కార్మికులు మనోవేదనకు గురై ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలి.– సూర్యప్రకాష్,ఐసీబీఎఫ్‌ మాజీ సభ్యుడు, ఖతార్‌

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top