‘ఆరోగ్య శ్రీ’కారం

World's largest govt funded health protection plan ... - Sakshi

ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వైద్య బీమా

10కోట్లులబ్ధి చేకూరే కుటుంబాల సంఖ్య

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్య పథకం

సుమారు 50 కోట్ల మందికి లబ్ధి

కొత్తగా 24 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు

టీబీ పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు 600 కోట్లు

న్యూఢిల్లీ: ఆరోగ్యశ్రీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలపాలిట సంజీవనిలా నిలిచింది! బీదాబిక్కీకి కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించి లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ తరహాలోనే బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు.

దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. దీనికింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా రూ.5 లక్షల వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వరంగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్తగా 24 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా చూస్తామన్నారు. ‘‘ఆరోగ్యభారతం ద్వారానే సంపన్న భారతం సాకారమవుతుంది. పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. అందుకే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశ పెడుతున్నాం. ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రభుత్వ పథకం.

ఈ పథకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తాం. మున్ముందు దేశ ప్రజలందరికీ వర్తించేలా ‘సార్వత్రిక ఆరోగ్య బీమా’ వైపు అడుగులు వేస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు వివిధ ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీఐ) కింద పేదలకు ఏటా రూ. 30 వేల వైద్య బీమా మాత్రమే ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించారు.

ఆరోగ్య బడ్జెట్‌ రూ.54,667 కోట్లు
ఆరోగ్య రంగానికి గతేడాది రూ.53,198 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.54,667 కోట్లు కేటాయించారు. అలాగే ఆరోగ్య పరిశోధన విభాగానికి కిందటేడాది రూ.1,500 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.1,800 కోట్లు ప్రతిపాదించారు.

జైట్లీ ఇంకా ఏమన్నారంటే..
► ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం, 1.5 లక్షల హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటును చేపట్టాం.
► ఈ సెంటర్ల ద్వారా  పేదలకు ఉచిత మందులతోపాటు వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తాం
► ఆరోగ్య రంగంలో తెస్తున్న కొత్త పథకాల ద్వారా లక్షల మందికి.. ప్రత్యేకించి మహిళలకు ఉపాధి కల్పిస్తాం
► కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్‌) కింద హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లను దత్తత తీసుకునేలా ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తాం
► క్షయ వ్యాధి ఏటా ఎందరినో బలితీసుకుంటోంది. అందుకే టీబీ రోగులకు పోషకాహారం అందించేందుకు రూ.600 కోట్లు కేటాయిస్తున్నాం.
► చికిత్స పొందే కాలంలో రోగులకు నెలకు రూ.500 చొప్పున అందిస్తాం
► ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద 2022 నాటికల్లా అందరూ ఆరోగ్యంగా ఉండే, ఉత్పత్తిని పెంచే, పేదరికం లేని నవ భారత్‌ను నిర్మిస్తాం
► దివ్యాస్త్రాలతో ఆకాశానికి అడ్డుగోడ కట్టి అర్జునుడు కాపు కాస్తుండగా... అనేకానేక అమూల్యమైన మూలికలకు నిలయమైన ఖాండవ వనాన్ని వేయి నాల్కలతో కబళించి ఆరోగ్యం పుంజుకుంటాడు అగ్నిదేవుడు.
► అదే మాదిరిగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకంతో ఏకంగా 50 కోట్ల మంది భారతీయుల ఆరోగ్యానికి రక్షణ ఛత్రం కల్పించనున్నట్టు ప్రకటించారు విత్త మంత్రి...!
► వైద్య చికిత్సల కోసం దేశంలో లక్షలాది మంది ఆస్తులు
► అమ్ముకోవాల్సి వస్తోంది. మరెందరో అప్పుల పాలవుతున్నారు. అలాంటి నిరుపేదలను ఆదుకునేందుకు మా ప్రభుత్వం
► చిత్తశుద్ధితో ఉంది. వైద్య సదుపాయాలను మరింత విస్తృతం చేస్తాం. నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

– అరుణ్‌జైట్లీ

బడ్జెట్‌ హైలైట్స్‌
► వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,000 కోట్లతో నిధి. దీని ద్వారా దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, 585 ఏపీఎంసీల అభివృద్ధి.
► అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత.
► రూ. 2.5 లక్షలు, అంతకు మించిన లావాదేవీలకు పాన్‌ కార్డు తప్పనిసరి.
► ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు గత ఏడాది రూ.715 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అది రూ.1,400 కోట్లకు పెరిగింది.
► ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు.
► స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా మరో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం
► జాతీయ జీవనోపాధి మిషన్‌కు రూ.5,750 కోట్లు.
► ‘ఆయుష్మాన్‌భవ’ కింద 2 ప్రధాన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top