అరచేతిలో ఒదిగిపోయే శాటిలైట్

 World Smallest Satellite Made by Four Indian Students - Sakshi

చెన్నై : సాధారణంగా శాటిలైట్‌ బరువు టన్నులకు టన్నులు ఉంటుంది. దాని ఎత్తు, పొడవులు కూడా అదే మాదిరి ఉంటాయి. అయితే గుడ్డు కంటే తక్కువ బరువుగా.. అరచేతిలో ఒదిగిపోయే శాటిలైట్‌ను తమిళనాడు ఇంజనీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు. ప్రపంచంలో అత్యంత తేలికైన, చౌకైన శాటిలైట్‌ను రూపొందించి, సరికొత్త వరల్డ్‌ రికార్డును సృష్టించారు. 

విద్యార్థులు రూపొందించిన శాటిలైట్‌ అరచేతిలో ఒదిగిపోతుంది. దీని ఖర్చు కేవలం 15 వేల రూపాయలు మాత్రమే. ఇక బరువు విషయానికి వస్తే గుడ్డు కంటే తక్కువగానే ఉంటుంది. అంటే 33.39 గ్రాములు మాత్రమే. ఈ శాటిలైట్‌ను నలుగురు ఫస్ట్‌-ఇయర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు కేజే హరిక్రిష్ణన్‌, పీ అమర్‌నాథ్‌, జీ సుధి, టీ గిరిప్రసాద్‌లు రూపొందించారు. వీరంతా చెన్నైకి దగ్గర్లోని హిందూస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఇన్‌ కెలంబక్కంలో చదువుకుంటున్నారు. ఈ శాటిలైట్‌ పేరును ‘జైహింద్‌-1ఎస్‌’గా నామకరణం చేశారు. ఈ శాటిలైట్‌ను వాతావరణ పరిస్థితుల డేటాను సేకరించడానికి ఉపయోగించుకోవచ్చని విద్యార్థులు తెలిపారు. అచ్చం ఈ శాటిలైట్‌ చూడానికి చతురస్రాకారంలో ఉన్న క్యూబ్‌ మాదిరే ఉంది. 

ఆగస్టులో నాసాలో దీన్ని లాంచ్‌ చేయబోతున్నారు. బెలూన్‌ లేదా రాకెట్‌లో పెట్టి ఈ శాటిలైట్‌ను ఆగస్టులో ఆకాశంలోకి పంపించబోతున్నారు. బెలూన్ కావలసిన ఎత్తులో చేరుకున్న తరువాత, ఆ శాటిలైట్‌ బెలూన్ నుంచి విడిపోతుంది. దీనికి 20 రకాల వాతావరణ పారామీటర్స్‌ కొలిచే సామర్థ్యం ఉంటుంది. సెకన్‌కు నాలుగు పారామీటర్స్‌ను రికార్డు చేయనుంది. ఆ డేటాను శాటిలైట్‌లో ఉంచే బిల్డ్‌ఇన్‌ ఎస్‌డీ కార్డులో స్టోర్‌ చేస్తుంది. 40 అడుగుల ఎత్తులో ఈ శాటిలైట్‌ను పరీక్షించిన తర్వాత, గత వారంలో నాసాకు దీన్ని పంపినట్టు విద్యార్థులు చెప్పారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top