ఆలయం వద్ద హైడ్రామా

Women targeted by Sabarimala protesters - Sakshi

శబరిమల: శబరిమల అయ్యప్ప ఆలయంలో శ్రీ చిత్ర పెరుమాళ్‌ పూజ సందర్భంగా మంగళవారం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూజ చేసేందుకు వచ్చిన మహిళను కొందరు భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు అడ్డుకోగా తోపులాట చోటుచేసుకుంది. నిరసనలను చిత్రీకరిస్తున్న మలయాళ టీవీ న్యూస్‌ చానల్‌ కెమెరామన్‌పై దాడి జరిగింది. పూజ కోసం సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు, తిరిగి మంగళ వారం ఉదయం 5 నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించిన అధికారులు అనంతరం ఆలయాన్ని మూసివేశారు.

పూజ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో ఆలయం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. కాగా, మండల పూజల కోసం ఈనెల 17వ తేదీ నుంచి రెండు నెలలపాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు.

కొనసాగిన నిరసనలు..
త్రిసూర్‌కు చెందిన లలితా రవి(52) రాగా సన్నిధానం వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు.  పోలీసులు ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి, పూజలు చేయించారు. నిరసనలను చిత్రీకరిస్తున్న టీవీ  చానల్‌ కెమెరామన్‌పై కొందరు దాడి చేశారు.

పంబ వద్దకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు 50 ఏళ్లలోపు మహిళలు నిరసనల కారణంగా వెనుదిరిగారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 50 ఏళ్లు పైబడిన మరో మహిళా బృందం ఇరుముడి లేకుండా నడప్పనండాల్‌ వద్దకు రాగా పోలీసు భద్రత కల్పించి, దర్శనం చేయించారు. ఇరుముడి లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వల్సన్‌ తిల్లంకేరి ‘పతినెట్టం పడి’ మెట్లపైకి వచ్చారంటూ టీవీ చానళ్లు ప్రసారం చేసిన దృశ్యాలు కలకలం రేపాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top