ఏ దేశమయితేనేం, ఆమె ఓ తల్లేనా!?

Woman Thrashing Minor Girl In Viral Video Identified Jammu Police - Sakshi

న్యూఢిల్లీ : ‘ఇంటి ముందు అరుగు మీద అమాయకంగా కూర్చున్న నాలుగేళ్ల పాప వద్దకు పంజాబీ కుర్తా, పైజామా ధరించి బలిష్టంగా ఉన్న తల్లి వచ్చి, అమాంతంగా ఆ పాప జుట్టు పట్టుకుని అరచేతితో వీపు మీద దబా దబా బాదడం, ఆ తర్వాత ఆ తల్లి కాసేపు దమ్ము పీల్చుకొని వద్దు, వద్దంటూ రెండు చేతులతో వేడుకుంటున్న ఆ పాపను నిర్దాక్షిణ్యంగా చెంప మీద లాగి కొట్టడం, కింద పడిపోయిన ఆ పాపను అలాగే జుట్టు పట్టుకొని వీపు మీద మళ్లీ కొట్టడం, కొట్టీ కొట్టీ చేతులు మంట పుట్టాయి కాబోలు... పక్కన గోడ మీదున్న స్లిప్పరు తీసుకొచ్చి మళ్లీ ఆ పాప జుట్టు పట్టుకొని వీపులో దబా దబా బాదడం’ దృశ్యాలను వీడియోలో చూసిన నెటిజన్లు నిజంగా కన్నీరు మున్నీరవుతున్నారు. పాకిస్తాన్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆ రక్కసి తల్లిని గుర్తించి పోలీసులకు పట్టించే వరకు ఈ వీడియోను షేర్‌ చేయమంటూ సలహాలు, సూచనలతో గత రెండు రోజులుగా తెగ షేర్‌ చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబీ కుటుంబాల్లో తల్లులు, పిల్లలను ఇలా బాదడం సర్వ సాధారణమంటూ మరి కొందరు సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ కాలమిస్ట్, రచయిత తరేక్‌ ఫతా కూడా ఈ వీడియోను షేర్‌ చేశారు.

వీడియోలో ఆ తల్లి, పాపను కొట్టడాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆమెలో కోపం, అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పాపను అంతగా కొట్టేంత ఆక్రోశం మాత్రం కనిపించదు. ఆ పాపకు తాకరాని చోట దెబ్బలు తాకకుండా జాగ్రత్తగా వీపును వంచి గట్టిగా కొడుతోంది. జుట్టు పట్టుకొని పైకి లాగినప్పుడు కూడా జట్టూడినంత నొప్పి పెట్టకుండా జట్టును సరిచేసి మరీ పట్టుకుంటుంది. లోతుగా ఆలోచిస్తే ఆమె పాప మీద కాదు, మరెవరి మీదనో కోపం, ఆక్రోశం ఉందనిపిస్తుంది. అసలు ఆ సంఘటననే పాకిస్తాన్‌లో జరగలేదు. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో, నగరి ప్రాంతంలో జరిగింది.

స్థానిక జేకే మీడియా, స్థానిక జర్నలిస్ట్‌ ఆశిష్‌ కోహ్లీ ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ వీడియాను రహస్యంగా రికార్డు చేసిందీ మరెవరో కాదు, ఆ దుర్మార్గురాలి భర్త, ఆ పాపకు స్వయాన తండ్రి. భర్త మీద కోపంతో ఆ భార్య అలా కన్నకూతురు మీద కసి తీర్చుకుంది. శిశు సంక్షేమ శాఖ ఫిర్యాదు మేరకు జమ్మూ పోలీసులు ఆ తల్లిదండ్రులిద్దరిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top