తుటుకమండా కాలువ దగ్గర ఎస్‌ఓజీ జవాన్‌ల కూంబింగ్ (మృతి చెందిన మహిళా మావోయిస్టు)
కొంధమాల్ జిల్లాలో బల్లిగుడా కామన్‌కుల్‌లో ఎస్‌ఓజీ జవాన్‌లపై మావోయిస్టుల దాడి అనంతరం కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న కొంధమాల్ జిల్లాలో మళ్లీ కలకలం రేగింది.
	♦ పలువురు దళసభ్యులకు గాయాలు
	♦ భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం
	♦ సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం
	
	బరంపురం : కొంధమాల్ జిల్లాలో బల్లిగుడా కామన్‌కుల్‌లో ఎస్‌ఓజీ జవాన్‌లపై మావోయిస్టుల దాడి అనంతరం కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న కొంధమాల్ జిల్లాలో మళ్లీ కలకలం రేగింది. బల్లిగుడాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. ఈ సంఘటనతో రాష్ట్రపోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.   కొంధమాల్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయాలతో తప్పించుకోగా   స్థానిక పోలీసుల సహాయంతో ఎస్‌ఓజీ జవాన్‌లు వారి జాడ కోసం జల్లెడపడుతున్నారు.
	
	దీంతో స్థానిక గిరిజన గూడాలు  పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నాయి. కొంధమాల్ ఎస్‌పీ మిత్రభాను మహాపాత్రో అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.    కొంధమాల్ జిల్లా బల్లిగుడా పోలీసు స్టేషన్, బరకుమా పండి పరిధిలో గల సులగూడ పంచాయతీ సతలి అటవీ ప్రాంతంలో తుటుకమండా కాలువ దగ్గర పోలీసులు, ఎస్‌ఓజీ జవాన్‌లు సయుక్తంగా కూంబింగ్ అపరేషన్ చేపట్టిన సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు.  దీంతో ఇరుపక్షాల మధ్య హోరాహోరీ  కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్‌లకు గాయాలు కాగా, ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది.   మృతి చెందిన మహిళను ఒడియా భాష తెలియని మహిళా మవోయిస్టుగా గుర్తించామని బహుశా ఛత్తీస్‌గఢ్  క్యాడర్‌కు మావోయిస్టుగా అనుమానిస్తున్నట్లు ఎస్‌పీ    తెలియజేస్తున్నారు.  
	
	సమాచారం మేరకు కూంబింగ్
	 కొధమాల్ జిల్లా బల్లిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో బరకమా, బడాంఖా, సతలి, డాఖా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో  అయా అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో రెండు ఎస్‌ఓజీ జవాన్‌ల బృందం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిందని ఎస్పీ చెప్పారు.  ఎస్‌ఓజీ జవాన్‌లు కూంబింగ్ చేపట్టిన సమయంలో సతలి అటవీ తుటుక కెనాల్ దగ్గర మావోయిస్టులు, పోలీసులు ముఖాముఖి ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా సుమారు 3 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. 45 మీటర్ల  దూరంలో  సుమారు 200 రౌండ్‌లకు పైగా ఎదురు కాల్పులు జరిగాయి.
	
	అనంతరం పోలీసుల కాల్పుల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు దట్టమైన అడవిలోకి  పారిపోయారు. తుటుక కెనాల్ దగ్గర నిర్వహిస్తున్న మావోయిస్టుల బేస్ క్యాంప్‌లో సుమారు 15 నుంచి 16 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా మిగిలిన మావోయిస్టులు తీవ్ర గాయాలతో దట్టమైన అడవి ప్రాంతంలోకి పారిపోయినట్లు మావోయిస్టు బేస్ క్యాంప్ ప్రాంగణంలో చుట్టూ  పడి ఉన్న రక్తపు ధారలను బట్టి అనుమానిస్తున్నట్లు ఎస్‌పీ మిత్రభాను విలేకరులకు తెలియజేస్తున్నారు.
	
	భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం
	మావోయిస్టులు విడిచి పారిపోయిన బేస్ క్యాంప్ ప్రాంగణంలో 303 రైఫిల్, మూడు చార్జర్ క్లాంప్స్, 13 రౌండ్‌ల తుటాలు, 5 గుళ్లు ఉన్న పాలిథిన్ కవర్, ఒక కెమెరా, రూ.42వేల నగదు, ఒక నోకియా మొబైల్, చార్జర్, మహిళ చేతి గడియారం, దోమతెర, 3 స్టీల్ మగ్గులు, సబ్బులు, రెండు కుర్చీలు, బ్లేడ్, 3 మెమరీ కార్డులు, టార్చిలైట్, 3 ఎస్‌బీ కార్డులు, 3 ఇయర్ ఫోన్‌లు, ఒక హిందీ విప్లవ పుస్తకం, మావోయిస్టుల వివరాల పుస్తకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందీలో దొరికిన మావోయిస్టు విప్లవ పుస్తకం ద్వారా మృతిచెందిన మావోయిస్టు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తునట్లు ఎస్‌పీ తెలియజేస్తున్నారు.  మృతి చెందిన మహిళా మావోయిస్టు వివరాలు తెలిసిన అనంతరం  వారి కుటుంబానికి మృతదేహాన్ని  అప్పగించనున్నామని అప్పటివరకు మార్చురీలో ఉంచుతామని అప్పటికీ ఎవరూ రాకపోతే తామే దహనం చేయనున్నట్లు ఎస్‌పీ తెలియజేశారు.
	
	జోరుగా కూంబింగ్   
	 ఎదురు కాల్పుల నేపథ్యంలో కొంధమాల్‌లో మావోయిస్టులు క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు అధికార్లు హైఅలెర్ట్ అయ్యారు. బరకుమా, కామన్‌కులా, మలిసియా అటవీ ప్రాంతాల్లో జోరుగా కూంబింగ్ అపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు కొలాహండి, బౌధ్, కొంధమాల్ గంజాం జిల్లాల సరిహద్దుల గుండా కారిడార్‌గా ఏర్పరుచుకుని వారి కార్యకలాపాలు ముమ్మరం చేసి భారీ  విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో ఎస్‌ఓజీ జవాన్‌లు కొంధమాల్, గజపతి, బౌధ్  గంజా జిల్లాల సరిహద్దుల్లో అడుగడుగునా కూంబింగ్ అపరేషన్ ముమ్మరం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
