మీటూ ఉద్యమం : మగవాళ్లూ బయటకు రావాలి!

Will MeToo Become WeToo? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘హీ ఫర్‌ షీ’ ఉద్యమం ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న హింస గురించి ఈ ఉద్యమంలో చర్చ మొదలయింది. దాన్ని మహిళల సమస్యగా భావించి పురుషులు అంతగా స్పందించలేక పోయారు. లైంగిక వేధింపులపై కూడా చర్చ జరిగింది. చివరకు బాధితురాలి భద్రతకు ఆమెనే బాధ్యత వహించాలనే అభిప్రాయానికి స్త్రీ, పురుషులు రావడంతో ‘హీ ఫర్‌ షీ’ ఉద్యమం కాస్త చల్లారిపోయింది. 

ఇప్పుడు భారత్‌లోని అన్ని రంగాల్లో ముఖ్యంగా బాలీవుడ్, మీడియాలో ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంది. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ దగ్గరి నుంచి మీడియా మాజీ ఎడిటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్‌ వరకు అందరిపైన లైంగిక వేధింపుల ఆరోపణల పరంపర కొనసాగుతోంది. కొందరేమో క్షమాపణలు చెబుతున్నారు. మరి కొందరు స్పందించేందుకు తిరస్కరిస్తున్నారు. ఇంకొందరు ఖండిస్తున్నారు. పదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ల క్రితం జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు వారు ఎందుకు మాట్లాడలేదు ? మహిళలకు మరింత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ‘సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెడ్రెస్సల్‌) యాక్ట్‌-2013’ లో తీసుకొచ్చినప్పటికీ వారు ఎందుకు కేసు పెట్టలేదు? అప్పుడు పరువు పోతుందని భయపడ్డారా? ఆ పరువు మరి ఇప్పుడు పోదా? ఈ వయస్సులో పోయినా ఫర్వాలేదా? ‘మీ టూ’ ఉద్యమం కారణంగా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చామని చెబుతున్నారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సమాజంలో వర్క్‌ ప్లేస్‌లో మహిళలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారా? మగవాళ్లు గురవడం లేదా? మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని లైంగిక వివక్ష అంశాలపై ఆసక్తికరమైన ఆర్టికల్స్‌ రాసే మహిళా జర్నలిస్ట్‌ సుభుహీ సాఫ్వీ చెబుతున్నారు. ఈ సందర్భంగా తన ఒకానొక మిత్రుడికి జరిగిన అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఓ మీడియాలో లేడీ బాస్‌ దగ్గర అతను పనిచేసేవాడట. ఆ లేడీ బాస్‌ ప్రతి రోజు అతన్ని లైంగికంగా వేధిస్తూ రావడంతో ఓ రోజు అతగాడు హెచ్‌ఆర్‌ విభాగానికి ఫిర్యాదు చేశారట. ‘ఇంతకాలం ఎంజాయ్‌ చేసి, మోజు తీరాక వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా?’ అంటూ అతని ఫిర్యాదును స్వీకరించేందుకు వారు తిరస్కరించారట. దాంతో అతగాడు ఉద్యోగం మానేసి మరో మీడియాకు మారిపోయాడట. 

‘మీ టూ’ ఉద్యమానికి నాంది పలికిన హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్‌ ఇప్పుడు కోర్టులో కూడా ఇలాగే వాదిస్తున్నారు. ‘నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. సినిమా అవకాశాలు పొందారు. ఇష్ట పూర్వకంగానే పడక సుఖం పొందారు. అన్ని తీరాక ఇప్పుడు లేట్‌ వయస్సులో నాపై అభాండాలు వేస్తున్నారు’ అని ఆయన అమెరికా కోర్టు ముందు చేసిన వాదనలో బలం ఉందా? ఉంటే ఆ వాదన మన బాలీవుడ్‌ పురుష పుంగవులకు వర్తించదా? అన్నది ఒక్క పక్క చర్చ అయితే, లైంగిక వేధింపులకు గురైన మగవాళ్లు కూడా ఉంటారని, వారంతా  ఇప్పుడు ‘వుయ్‌ టూ’ అంటూ ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. డెమీ మూర్, మైఖేల్‌ డగ్లస్‌ నటించిన హాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘డిస్క్లోజర్‌‌’ ఇతివత్తం కూడా మహిళా బాస్‌ లైంగికంగా వేధించడమే కదా!  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top