నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు: శింబు

 will be back with something different: Hero Simbu  - Sakshi

సాక్షి, చెన్నై : తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని నటుడు శింబు పేర్కొన్నారు. చర్చనీయాంశ నటుల్లో శింబు ఒకరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి ఉండదు. ఆ మధ్య బీప్‌ సాంగ్‌ పాడి కేసులు, కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో  తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానాలను ఎక్కుపెట్టి వైరముత్తు కొడుకు కపిలన్‌ రాసిన పాటను పాడారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ఆ విధానాలకు వ్యతిరేకంగా నటులు రజనీకాంత్, కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలు పొందుపరచారు. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో నటుడు శింబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

నేనెవరికీ భయపడను
ఈ విషయంపై నటుడు శింబు తన ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వివరణ ఇస్తూ పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ పన్ను విధానం లాంటి విషయాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాటలో పొందుపరచామని తెలిపారు. అయితే ఈ పాటను రాసింది తాను కాదని, ఒక గాయకుడిగా తన బాధ్యతను మాత్రమే తాను నిర్వహించానని అన్నారు. ఈ విషయంలో తనకెలాంటి బెదిరింపులు రాలేదని, ఒక వేళ అలాంటివేవైన వచ్చినా వాటికి తాను భయపడనని అన్నారు. ప్రజల నుంచి తనకు వ్యతిరేకత వ్యక్తం కాలేదని, అలా ఆ పాట ఎవరి మనసునైనా గాయపరిచినట్లు అయితే తాను క్షమాపణ కోరుకుంటున్నానని శింబు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top