అమ్మలోటు తీర్చేదెవరు? | Who will refill the Jayalalitha deficit | Sakshi
Sakshi News home page

అమ్మలోటు తీర్చేదెవరు?

Dec 7 2016 3:44 AM | Updated on Sep 2 2018 5:24 PM

అమ్మలోటు తీర్చేదెవరు? - Sakshi

అమ్మలోటు తీర్చేదెవరు?

మరణించేవరకూ జయ వెన్నంటి ఉన్న శశికళ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కోరలేదు? అన్న ప్రశ్నకు రాజకీయ పండితులు అనేక కారణాలు చెబుతున్నారు.

సీఎం పదవిని శశికళ ఎందుకు కోరలేదు?

 మరణించేవరకూ జయ వెన్నంటి ఉన్న శశికళ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కోరలేదు? అన్న ప్రశ్నకు రాజకీయ పండితులు అనేక కారణాలు చెబుతున్నారు. జయ, శశికళను పట్టి పీడిస్తున్న అక్రమాస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జయ కన్నుమూసినా-ఈ కేసు నడుస్తుంది. శశికళ ఈ కేసులో రెండో ముద్దాయి. ఈ కారణంగానే ఆమె సీఎం పదవి ఆశించలేదని చెబుతున్నారు. ఆమె సుప్రీంకోర్టు నుంచి నిర్దోషిగా బయటపడే వరకూ ముఖ్యమంత్రి పదవిపై కన్నేయకపోవచ్చు. ‘అమ్మ’ బతికుండగా చట్టపరమైన ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే సీఎం పదవి చేపట్టిన అనుభవం పన్నీర్‌సెల్వంది.

ఇప్పుడు, శశికళను ఇబ్బందిపెట్టకుండా, అలా అని కీలుబొమ్మ సీఎం అని పేరు తెచ్చుకోకుండా బండి నడపడం ఆయనకు కుదిరేపని కాదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తేవర్ల మధ్య విభేదాలొస్తే ప్రభుత్వం కూలిపోతుంది. డీఎంకే, దాని అధినేత ఎం.కరుణానిధిని బూచిగా చూపించి అన్నాడీఎంకేలో సాధిస్తున్న ఐక్యత ఎక్కువ కాలం నిలబడదు. శశికళ కారణంగా తేవర్లు ఇప్పటికే ఏఐఏడీఎంకేలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నారనే ఆరోపణ ఉంది. జయలేని ఈ పరిస్థితుల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా రాష్ట్రంలో తేవర్ల ఆధిపత్యం కనిపిస్తే అది ఈ పార్టీకి శాపమవుతుంది.

దాదాపు వందేళ్ల తమిళ రాజకీయాల్లో ‘బ్రాహ్మణేతర ప్రజాస్వామ్యం’ బలపడింది. అంటే తమిళనాట ఏ ఒక్క కులం ఆధిపత్యం లేకుండా పాలన, రాజకీయాలు నడుస్తున్నాయి. డీఎంకేలో సైతం తేవర్లకు తగినంత ప్రాతినిధ్యం ఉంది. అసెంబ్లీలో 42 మంది తేవర్లు ఎమ్మేలేలున్నా, జయ మంత్రివర్గంలో గౌండర్లకు తగినంత వాటా ఇచ్చారు. ఒకవేళ సెల్వం, శశికళ ఏకమైతే, పార్టీలో గౌండర్, నాడార్, వన్నియార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ చేతులు కలిపితే డీఎంకేలో చేరడానికి ఫిరాయింపు నిరోధకచట్టం అడ్డంకి కాదని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
 పార్టీ నిర్మాణం బలహీనం
 డీఎంకే సంస్థాగత నిర్మాణం పటిష్టమైంది. క్రమం తప్పకుం డా అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలకు ఎన్నికల ద్వారా మాత్రమే నేతలను ఎన్నుకుంటారు. నాయకత్వం మాత్రమే కరుణానిధి కుటుంబం గుప్పిట్లో ఉంది. ఏఐఏడీఎంకేకు అలాంటి బలమైన వ్యవస్థ లేదు. జయ వంటి నేత లేనప్పుడు ఏఐఏడీఎంకే బలహీన మయ్యే ప్రమాదముంది. బీజేపీ ఏఐఏడీఎంకే అంతర్గత రాజకీయా ల్లో పెద్దగా జోక్యం చేసుకోదనే వాదన వినిపిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వంగాని, బీజేపీ కేంద్ర నాయకత్వంగాని ప్రస్తుత సెల్వం సర్కారును నిలబెట్టడానికి ప్రయత్నించకపోవచ్చు.  కర్ణాటకలో మాదిరిగా విస్తరించడానికి వీలులేని తమిళనాట మితిమీరిన రాజకీయం చేసి నష్టపోయే స్థితిలో బీజేపీ లేదు.  పన్నీర్‌సెల్వంను వద్దునుకుంటే- ప్రధాన శూద్రకులాలు తేవర్లు, కొంగు వెల్లాల గౌండర్ల మధ్య రాజీ కుదిరితే లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురైకి అవకాశం రావచ్చని  ప్రచారం జరుగుతోంది.
 
 తేవర్ల ‘ఆధిపత్యం’ కరుణకు ఆయుధమవుతుందా?
 జయ నీడన శశికళ నాయకత్వాన తేవర్లు డీఎంకే హయాంతో పోల్చితే కాస్త ఎక్కువ అధికారం అనుభవిస్తున్నారు. ఎంతకాదన్నా జయ కులాలకు ప్రాధాన్యం విషయంలో సమతూకం పాటించారు. అలాకాక పన్నీర్‌సెల్వం, శశికళ ఓ అవగాహనకు వచ్చి లేదా రాకుండా పాలనలో తేవర్ల ఆధిపత్యాన్ని తీసుకొస్తే అది కరుణానిధికి పదునైన ఆయుధమవుతుంది. కొద్ది నెలలకైనా ఏఐడీఎంకేలో కీచులాటలను వాడుకోవడానికి కరుణ రంగంలోకి దిగుతారు. తేవరేతర కులాలను ఏకం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపే  సామర్ధ్యం ఏఐడీఎంకే  నాయకత్వానికి లేవు. మరో విధంగా చెప్పాలంటే-సెల్వం డా.మన్మోహన్‌సింగ్ కాదు. శశికళ సోనియాగాంధీ కాదు. తమిళనాట గౌండర్లు, తేవర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటే, ఉత్తర జిల్లాల్లో వన్నియార్లు ఎక్కువ. మదురై నుంచి కన్యాకుమారి జిల్లా వరకూ నాడార్ల ఉనికి బాగా కనిపిస్తుంది.
 
 ఏఐఏడీఎంకే భవిష్యత్?
 ‘‘జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకే చీలిపోతుందని భావిస్తున్నా. 30 శాతం పార్టీ ఎమ్యెలేలు తేవర్ కులానికి చెందినవారు (పన్నీర్ సెల్వం, శశికళ-ఇద్దరూ తేవర్లే). దాదాపు 70 శాతము న్న తేవరేతర శాసనసభ్యులు తేవర్ల ఆధిపత్యాన్ని  సహించక పోవచ్చు.’’ జయలలిత చనిపోయాక తమిళనాడు పాలకపక్షం భవితవ్యంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పిన మాటలివి. కొత్త సీఎంగా పన్నీర్‌కు పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో మద్దతు లభించింది. పార్టీ నాయక త్వాన్ని శశికళకు అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని మంగళవారం రాత్రి చెన్నై నుంచి వార్తలొచ్చాయి. జయలలిత అనంతర పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్నకు జవాబు మాత్రం కొన్ని నెలల తర్వాత లభించవచ్చు.
 
 డీఎంకేకే అడ్వాంటేజ్!
 92 ఏళ్లు దాటిన కరుణానిధి ఎక్కువ కాలం బతక్కపోవచ్చేమోగాని ఆయన మరణానంతరం డీఎంకేను నిలబెట్టడానికి ఆయన చిన్న కొడుకు, మాజీ డెప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు, చిన్న కూతురు కనిమొళి ఉన్నారు. 29 ఏళ్ల క్రితంఎంజీఆర్ మరణానంతర పరిస్థితులను డీఎంకేకు అనుకూలంగా కరుణ మార్చగలిగారు. ఇప్పుడు కూడా ఏఐడీఎంకే కీచులాటలు ప్రమాదకర స్థాయికి చేరితే లబ్ధిపొందేది మళ్లీ డీఎంకేయే. ఏ రకంగా చూసినా ఏఐఏడీఎంకేను 2021 మే అసెంబ్లీ ఎన్నిక ల వరకూ నడిపించే గట్టి నాయకుడే కనిపించడం లేదు.
 
 ఎంజీఆర్ మరణానంతర పరిణామాలు పునరావృతం కావేమో!
 1987 డిసెంబర్‌లో పార్టీ స్థాపకుడు, సీఎం ఎం.జి.రామచంద్రన్ మరణించాక జరిగిన పరిణామాలు  పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పట్లో ఇద్దరు సీఎంలు(వీఆర్ నెడుంజెళియన్, జానకీ రామచంద్రన్) రెండు నెలల్లోపే అధికారం కోల్పోయాక ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత ఆవిర్భవించారు. అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలను సాకుగా చూపి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన విధించింది. 1988 జనవరి ఎన్నికల్ల్లో ఓడినా 1991 మే నాటికి జయలలిత సీఎం అయ్యారు. జయ మాదిరి జనాకర్షణ శక్తి ఉన్న నేత పాలకపక్షంలో హఠాత్తుగా పుట్టుకొచ్చే అవకాశాలు లేవు. తమిళ హీరో అజిత్‌కుమార్‌ను జయ తన వారసుడని చెప్పారని జరుగుతున్న ప్రచారానికి అధారాలు సృష్టిస్తే తప్ప ఆయన రంగం మీదకు రావడం కష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement