ఆ అధికారులను తొలగించండి: గవర్నర్‌

West Bengal Governor Says Sack Officials Who Fail To Enforce Lockdown - Sakshi

కోల్‌కతా: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధంఖర్‌ అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో వైఫల్యం చెందుతున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని మమతా బెనర్జీ సర్కారుకు సూచించారు. ‘‘కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు.. విధించిన లాక్‌డౌన్‌ను 100 శాతం అమలు చేయడంలో విఫలమైన పోలీసులు, అధికారులను తొలగించాలి. మతపరమైన సమ్మేళనాలు జరగకుండా చూడటంలో వాళ్లు వైఫల్యం చెందారు. లాక్‌డౌన్‌ను విజయవంతం చేసేందుకు కేంద్ర బలగాల మోహరింపు అంశాన్ని పరిశీలించాల్సి ఉంది’’అని ఆయన ట్వీట్‌ చేశారు.(లాక్‌డౌన్‌ సడలించే రంగాలు ఇవే..)

కాగా రాష్ట్రంలో పలు చోట్ల(మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట) లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం లేదంటూ బీజేపీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి మమత.. కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో నిఘా పెట్టాలంటూ కేంద్రం ప్రత్యేక చొరవ చూపిస్తోందని చురకలు అంటించారు.(ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు)

‘‘మతపరమైన వైరస్‌కు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదు. మనుషుల నుంచి మనుషులకు సోకే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటాం. అయితే దానర్థం షాపులు పూర్తిగా మూసివేయమని కాదు. ఆయా చోట్ల పర్యవేక్షణ కొనసాగుతోంది’’అని పేర్కొన్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిజాముద్దీన్‌ తబ్లిగీ జమాత్‌ ఘటన విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘నో కమ్యూనల్‌ క్వశ్చన్స్‌’’అని మమత సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెపై విమర్శల వర్షం గుప్పించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top