140 అడుగులు మించొద్దు

water levels of Mullaperiyar 2-3 feet below 142 mark - Sakshi

ముళ్లపెరియార్‌ డ్యాం నీటిమట్టంపై తమిళనాడుకు సుప్రీం ఆదేశం

రూ. 700 కోట్ల విరాళంపై యూఏఈ వివరణ

బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ రూ.4.2 కోట్ల సాయం

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ముళ్లపెరియార్‌ డ్యాం నీటిమట్టంపై కేరళ, తమిళనాడు మధ్య వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. కేరళలో వరద నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని డ్యాం నీటిమట్టాన్ని 139.99 అడుగులు కొనసాగించాలని తమిళనాడును ఆదేశించింది. ఆగస్టు 31 వరకూ ఈ ఉత్తర్వులు అమలు చేయాలని పేర్కొంది. ముళ్లపెరియార్‌ వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఆదేశాలు జారీచేస్తున్నామని కోర్టు శుక్రవారం తెలిపింది. డ్యాం నీటిమట్టాన్ని 139 అడుగుల వరకే కొనసాగించాలని ఆగస్టు 23న సమావేశమైన సబ్‌ కమిటీ తమిళనాడును ఇప్పటికే ఆదేశించినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. డ్యాం గరిష్ట నీటిమట్టాన్ని 142 అడుగుల వరకూ కొనసాగించవచ్చని 2014లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం గమనార్హం.

  తాజా తీర్పుపై తమిళనాడు తరఫు లాయర్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వివాదాన్ని విపత్తు నిర్వహణ అంశంగానే పరిగణిస్తున్నామని, కేరళలోని భారీ వరదను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టు స్పష్టంచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 6కు వాయిదా వేస్తూ.. ఆలోగా అభ్యంతరాల్ని వెల్లడించాలని కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు కోర్టు సూచించింది. రాష్ట్రంలో వరద ముప్పు పెరగడానికి ముళ్లపెరియార్‌ డ్యాం నుంచి ఒక్కసారిగా నీటిని వదలడం కూడా ఒక కారణమని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం తెల్సిందే. కేరళ ఆరోపణను తమిళనాడు తోసిపుచ్చింది. కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కడీ సమీపంలో నిర్మించిన ముళ్లపెరియార్‌ డ్యాం నిర్వహణ బాధ్యతల్ని ఒప్పందంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం చూస్తోంది.

సాయంపై నిర్ణయంకాలేదు: యూఏఈ
వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఎంత మేర ఆర్థిక సాయం చేయాలన్నదానిపై అధికారికంగా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) శుక్రవారం స్పష్టంచేసింది. యూఏఈ రూ. 700 కోట్ల సాయం ప్రకటించిందని, ఆ సాయాన్ని భారతసర్కారు నిరాకరిస్తోందని  వార్తలురావడం తెల్సిందే. కేరళ వరద బాధితుల సాయం కోసం తమ ప్రభుత్వం కేవలం జాతీయ అత్యవసర కమిటీని మాత్రమే ఏర్పాటు చేసిందని యూఏఈ రాయబారి అహ్మద్‌ అల్బనమ్‌ చెప్పారు.

వరద బాధితులకు సాయంపై రాబోయే రోజుల్లో తన ప్రణాళికను యూఏఈ వెల్లడించవచ్చని ఆయన తెలిపారు. కాగా కేరళకు రూ. 700 కోట్ల సాయం చేస్తానని ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్‌ ప్రిన్స్‌ ఫోన్‌ చేశారంటూ ఆ రాష్ట్ర సీఎం విజయన్‌ చెప్పడం తెల్సిందే.   కేరళకు బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ 6 లక్షల డాలర్ల(రూ. 4.2 కోట్లు) అత్యవసర మొత్తాన్ని సాయంగా ప్రకటించింది. దీనిని వరద సాయం, పునరావాసం కోసం యునిసెఫ్‌కు అందచేస్తామని పేర్కొంది. కేరళలోని స్థానిక ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్న యునిసెఫ్‌కు ఈమొత్తం ఎంతో ఉపకరిస్తుందని అందులో ఆకాంక్షించింది.

శిబిరాల్లోనే 10 లక్షల మంది బాధితులు
కేరళలో వరద దాదాపుగా తగ్గుముఖం పట్టినా.. దాదాపు 10.40 లక్షల మంది బాధితులు 2,770 శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా 5 లక్షల మంది శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇళ్లు పూర్తినేలమట్టమైన బాధితులు పునరావాసం కోసం క్యాంపుల్లో ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 37 వేల బావులు, 60 వేల ఇళ్లను ఇంతవరకూ శుభ్రం చేశామని సీఎం పినరయి విజయన్‌ చెప్పారు.

వరద బాధితులకు సాయం చేయడం ద్వారా ఓనం పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెను విపత్తు నేపథ్యంలో ఈసారి ఓనం వేడుకల్ని కేరళ ప్రభుత్వం, వివిధ సంస్థలు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరద విలయంలో భారీ నష్టపోయిన కేరళలో ప్రత్యేకంగా పరిగణించాలని.. ఇతర రాష్ట్రాల విపత్తులతో దీనిని పోల్చవద్దని పరోక్షంగా కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళను ఆదుకునేందుకు ముందుకొస్తోన్న యూఏఈ, ఖతర్‌ తదితర దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top