వేధింపులపై మొదటి అనుభవాలు!

వేధింపులపై మొదటి అనుభవాలు! - Sakshi


తెలిసీ తెలియని వయసునుంచే అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసులోనే తమపై వేధింపులు ప్రారంభమౌతున్నట్లు అమ్మాయిలు ప్రత్యక్షంగా చెప్తున్నారు. యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న కొన్ని  వీడియోలు  అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  అతిచిన్న వయసులోనే ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి కొందరు చెప్పిన వివరాలు ఓల్డ్ ఢిల్లీ ఫిల్మ్స్ 'తెర'కెక్కించింది.   



భారతదేశంలో అమ్మాయిలు చిన్నతనంలోనూ, యుక్తవయసులోనూ కూడ లైంగిక వేధింపులకు గురికావడం సర్వ సాధారణమైపోయింది. జీవితంలో ఎదురయ్యే  సంఘటనల గురించి, స్వభావాలగురించి  పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడంతోనే  పిల్లలు ఇలా గందరగోళంలో పడటం, భయానకంగా మారడం జరుగుతోందని కొందరి అభిప్రాయం. అయితే  14 ఏళ్ళ అమ్మాయి తనకు ఎదురైన జిగుప్సాకరమైన అనుభవం ప్రత్యక్షంగా చెప్పడం చూస్తే... తల్లిదండ్రులు, పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు అంతా సిగ్గుపడాల్సిన అంశంగా కూడ మారింది.



ముఖ్యంగా భారత దేశంలో అమ్మాయిలు యుక్తవయసు వచ్చేసరికి పురుషులనుంచి అవాంఛిత లైంగిక సంబంధాలను ఏర్పరచుకొంటున్నట్లు తెలుస్తోంది.  అయితే  పిల్లలు.. ముఖ్యంగా కొడుకుల పెపంపకం విషయంలో తల్లులు సరైన జాగ్రత్తలను తీసుకోవడం లేదని అమ్మాయిలు చెప్తున్నారు. విషయాలను  అర్థమయ్యేట్లు బోధించడం మహిళల ప్రత్యేక విధి అంటున్నారు. అంతేకాదు తండ్రి కూడ బాధ్యత తీసుకోవాలంటున్నారు. అయితే చెప్పేది ఎవరైనా సరిగా చెప్పడం అన్నది మాత్రం ఇక్కడ అవసరం అంటున్నారు.



అయితే బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు వారి స్వేచ్ఛను సైతం హరిస్తున్నాయి. దీంతోనే ఆడపిల్లలు బయటకు వెళ్ళద్దు వంటి అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుత వీడియోల్లోని మహిళల అనుభవాలను చూస్తే వయోజనులే కాక యువకులు సైతం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత దేశంలో 2007 లెక్కల ప్రకారం చూస్తే... ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పెద్దలవల్ల  లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు  తెలుస్తోంది.  ఈ సమస్యను పరిష్కరించేందుకు.. ప్రస్తుతం యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియోల్లోని ప్రసంగాలు ప్రారంభవాచకాలు కావాలి.  మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇవే నాంది పలకాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top