
న్యూఢిల్లీ: పారసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది తననెంతో బాధిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘చర్చ, సంభాషణ, అసమ్మతి ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనవి. అంతేకానీ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితాన్ని ఇబ్బందిపాలు చేయడం మన వ్యవస్థ లక్షణం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. మన సమాజాన్ని విభజించాలనుకునేవారి ఎత్తుగడలు పారనివ్వబోమంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
భారతీయ పౌరులు ఏ మతానికి చెందిన వారైనా.. వారి హక్కులకు ఏరకంగానూ పౌరసత్వ చట్టం భంగం కలిగించబోదని ఆయన భరోసా ఇచ్చారు. పార్లమెంటు ఉభయ సభలు భారీ మెజారిటీతో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారని, పెద్దసంఖ్యలో రాజకీయ పార్టీలు, ఎంపీలు దీనికి మద్దతుతెలిపారని, శతాబ్దాల చరిత్రగల భారతీయ సంప్రదాయ విలువలైన సామరస్యం, కరుణ, సౌభాతృత్వాలకు ఈ చట్టం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వార్థశక్తుల ప్రయత్నాలను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.