
లఖిమ్‌పూర్‌ఖేరీ: ఓ వ్యక్తిపై ఆడపులి దాడిచేయడంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ఆ క్రూర జంతువును ట్రాక్టర్‌తో తొక్కించి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. లఖిమ్‌పూర్‌ఖేరీ జిల్లాలోని చైతువా గ్రామానికి చెందిన దేవానంద్(50) ఆడపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జంతువు దాడేనని ధ్రువీకరించుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అటవీప్రాంతంలో ఆడపులిని చుట్టుముట్టి కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు.. పులి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.