‘వీరే మన బంగారు భవిష్యత్తు’ | Venkaiah Naidu Addresses Through Virtual Conference About Education | Sakshi
Sakshi News home page

‘సాంకేతిక అంతరాలు తొలగిస్తేనే సమాన విద్య’

Jun 30 2020 2:42 PM | Updated on Jun 30 2020 7:33 PM

Venkaiah Naidu Addresses Through Virtual Conference About Education - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతో పాటు అందరికీ సెకండరీ, ఉన్నత విద్యను అందించేందుకు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ఐసీటీ అకాడమీ రూపొందించిన ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్-నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ‘పెరుగుతున్న సాంకేతికతతో కొత్త అవకాశాలను అందిస్తుండటంతో పాటు.. మన సమాజంలోని సాంకేతిక అంతరాన్ని మనకు గుర్తు చేస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎంతో మంది చిన్నారులకు సాంకేతిక ఉపకరణాల వినియోగం తెలియదు. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా.. అలాంటి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. తద్వారా మారుతున్న సాంకేతికతను వారు వినియోగించుకునే దిశగా మనమంతా కృషిచేయాలి’ అని ఉప రాష్ట్రపతి సూచించారు.

‘లాక్‌డౌన్ కారణంగా చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్ విద్యా విధానంలో భాగమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరందరు ఆన్‌లైన్ విధానంలో విద్యనభ్యసించేందుకు సరైన శిక్షణను అందించాల్సిన అవసరముందని, భారతదేశంలోని చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఆధునిక పద్ధతిలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి సాంకేతిక ఉపకరణాల ఖర్చును భరించలేరని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక అంతరాన్ని తగ్గించే విషయంలో ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రైవేటు రంగం కూడా పనిచేయాలి ముఖ్యంగా విద్యారంగంలోని సాంకేతిక సంస్థలు తమ ఉత్పాదనలు, ఉపకరణాలను విద్యార్థులకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని సూచించారు.

మన బంగారు భవిష్యత్తు అయిన చిన్నారులను మరింత ప్రోత్సహిస్తూ.. వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయడంలో మనవంతు పాత్రను పోషించాల్సిన సమయమిదని అని వెంకయ్యనాయుడు అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా విద్యాసంస్థలు డిజిటల్ క్లాసులు నిర్వహించడం, క్లౌడ్ ఆధారిత వేదికల ద్వారా విద్యార్థులతో అనుసంధానమై విద్యాబోధనతో పాటు పరీక్షలు కూడా ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నారన్నారని ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ర్చువల్ రియాలిటీ, అగుమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

‘‘ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు అనుసంధానకర్తగా, మార్గదర్శిగా, సలహాదారుడిగా, గురువుగా, పలు సందర్భాల్లో ఓ స్నేహితుడిగా సరికొత్త పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు.. అందరికీ అన్ని స్థాయిల్లో సరైన విద్యను అందించేందుకు అవసరమైన వినూత్న పరిష్కారాల కోసం ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని. భారతదేశంలోని యువశక్తి మన బలం. మనకున్న గొప్ప అవకాశం కూడా. దీన్ని సద్వినియోగపరచుకోవాలి. భారత యువతలో శక్తి సామర్థ్యాలకు కొదువలేదు. వీరికి సాంకేతికతను అందించి నైపుణ్యానికి సానబెట్టాలలి. అంతేగాక సాంకేతిక విద్యతో పాటు విలువలతో కూడిన భారతీయ విద్యావిధానాన్ని కూడా భవిష్యత్ తరానికి అందించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన నొక్కి చెప్పారు. విద్యార్థుల్లో సాంస్కృతిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెపొందించడాన్ని విద్యాసంస్థలు బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement