డిమాండ్ల సాధనకై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకై అన్నదాతలు ఆందోళన బాట పట్టి వ్యవసాయ ఉత్పుత్తల విక్రయాన్ని నిలిపివేయడంతో ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వ్యవసాయ రుణాల మాఫీ, పంటలకు కనీస మద్దతు ధరల పెంపును కోరుతూ రైతులు ఈనెల 1 నుంచి పదిరోజుల పాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరాలు, పట్టణాలకు పండ్లు, కూరగాయల సరఫరాలను నిలిపివేయడంతో టమోటాలు, బీన్స్ సహా పలు కూరగాయల ధరలు పదిశాతం మేర పెరిగాయి. సరఫరాలు తగ్గడంతో ధరలు పెరిగాయని ముంబయికి చెందిన కూరగాయల విక్రేత మహేష్ గుప్తా వెల్లడించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో హామీ ఇవ్వడంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా తాము కూరగాయలు, పాలు విక్రయించరాదని నిర్ణయించామని పంజాబ్‌కు చెందిన వ్యాపారి రమణ్‌దీప్ సింగ్ మాన్ పేర్కొనడం గమనార్హం.
దేశవ్యాప్త నిరసనలో భాగంగా రైతులు ఇటీవల జాతీయ రహదారులను ముట్టడించిన సంగతి తెలిసిందే. పలుచోట్ల రైతులు పాలు, కూరగాయలను కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్లపై పారవేశారు. కాగా, గత ఏడాది ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, దీంతో నిరసనలకు తీవ్రతరం చేయడం మినహా తమకు మరోమార్గం లేదని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలే స్పష్టం చేశారు.


