
అస్వస్థతకు లోనైన గడ్కరీ
సాక్షి, ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు.
గడ్కరీ కుర్చీలో పడిపోతుండగా పక్కనే ఉన్న గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, అక్కడున్న వారు స్పందించి కుర్చీలో కూర్చుండబెట్టారు. కొంత విశ్రాంతి అనంతరం ఆయన మామూలు స్థితికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం గడ్కరీ షిర్డీ బయలుదేరి వెళ్లారు. కాగా, 2014 ఎన్నికల్లో నాగపూర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన గడ్కరీ ఉపరితల రవాణా, నీటి వనరులు, షిప్పింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.