
బీజేపీ బెంగాల్ యూనిట్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్
కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కుక్కల్లా కాల్చేశారని ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తప్పుపట్టారు. యూపీ, అసోంలలో బీజేపీ ప్రభుత్వాలు ఏ కారణంగానైనా ప్రజలపై కాల్పులు జరపలేదని అన్నారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలతో బీజేపీకీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
నదియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల్లో రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేసిన వారిపై కాల్పులు జరపలేదని మమతా బెనర్జీ సర్కార్‌నూ ఘోష్ దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై దీదీ (మమతా బెనర్జీ) పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు... యూపీ, అసోం, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలు ఇలాంటి వారిని కుక్కల్లా కాల్చేశాయని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.