పౌరసత్వ బిల్లుకు కేబినెట్‌ ఓకే

Union Cabine approval Citizenship Amendment Bill - Sakshi

ఈ వారంలోనే పార్లమెంటుకు బిల్లు!

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని అవి వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు.

మూడు ఇస్లామిక్‌ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌షిప్‌–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది.  

తీవ్ర వ్యతిరేకత
కాంగ్రెస్, టీఎంసీ ఈ బిల్లున వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం భారత లౌకిక భావనకు వ్యతిరేకమని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్‌  నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు మోదీకి లేఖ రాశారు.  లోక్‌సభలో బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం సమస్య కాబోదుగానీ, రాజ్యసభలో విపక్షం ఈ బిల్లును అడ్డుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు లోక్‌సభలో గట్టెక్కింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకోవడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసింది.

కేబినెట్‌ నిర్ణయాల్లో మరికొన్ని..
► వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన  సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు.

► కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్‌ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్‌ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.

► ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), ఐటీపీఓ(ఇండియన్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

► జమ్మూకశ్మీర్లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉపసంహరించేందుకు ఆమోదం. ఇటీవలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ అంశం ఉండటంతో ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. అయితే, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి వారికి రిజర్వేషన్లను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను మీడియా ప్రశ్నించగా, బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారని జవదేకర్‌ వెల్లడించారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారన్నారు.

ఏమిటీ బిల్లు?
పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా  పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది.  

ఈశాన్య రాష్ట్రాల్లో..
బంగ్లాదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్‌ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది.  

పార్లమెంటులో బిల్లు గట్టెక్కుతుందా?  
లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్‌(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది. కొన్ని సవరణలతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున దీనిపై వ్యతిరేకత వచ్చినా ఆమోద ముద్ర పడుతుంది. ఇక రాజ్యసభలో మాత్రం జేడీ(యూ), అకాలీదళ్‌ వంటి పార్టీల మద్దతు లేకుండా బిల్లు గట్టెక్కలేదు.  రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు హోంమంత్రి అమిత్‌ పలు పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.

బిల్లుకు అనుకూలం
బీజేపీ, అకాలీదళ్, ఏఐఏడీఎంకే

బిల్లుకి ప్రతికూలం
కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top