పాఠశాలల్లో ప్రవేశాలకు ఆధార్‌ అక్కర్లేదు!

UIDAI Says Do Not Make Aadhaar Mandatory For Schools Admissions - Sakshi

యాజమాన్యాలూ అడగొద్దు: యూఐడీఏఐ

న్యూఢిల్లీ: పాఠశాలలో అడ్మిషన్‌ పొందాలంటే విద్యార్థులు ఆధార్‌ సమర్పించాల్సిన అవసరం లేదని, స్కూల్‌ యాజమాన్యాలు సైతం విద్యార్థులను అడగవద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)సూచించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1500 పాఠశాలల్లో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నర్సరీ లేదా ప్రాథమిక విద్యకు సంబంధించిన అడ్మిషన్లను వివిధ పాఠశాలలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల కోసం వచ్చిన చిన్నారుల ఆధార్‌ కార్డును సమర్పించాలంటూ వారి తల్లిదండ్రులను కోరడంతో ఈ విషయం కాస్తా యూఐడీఏఐ దృష్టి వెళ్లింది. 

తిరస్కరించరాదు.. 
పాఠశాల అడ్మిషన్లతోసహా చిన్నారులకు కల్పించే ప్రతి సౌకర్యానికి ఆధార్‌ సమర్పించాలని కోరడం సరికాదని, అది చట్టవిరుద్ధమైన చర్య అని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ఆధార్‌ సమర్పించలేదని ఏ పాఠశాల యాజమాన్యం కూడా అడ్మిషన్‌ను తిరస్కరించరాదని హెచ్చరించారు. 

కోర్టు ధిక్కారమే.. 
పాఠశాలలో చేరే సమయంలో ఆధార్‌ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని భూషణ్‌ సూచించారు. ఆ తర్వాత అవసరమైతే ప్రత్యేక క్యాంపులను నిర్వహించడం ద్వారా ఆధార్‌ను తీసుకోవచ్చని, అంతేకానీ, ఆధార్‌ సమర్పిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామనడం మాత్రం శిక్షార్హమైనదన్నారు. ఒక వేళ అలా బలవంతంగా ఆధార్‌ కోరితే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాలకు, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు, పాఠశాల అడ్మిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top