ఆధార్‌ గోప్యతను కాపాడండి

UIDAI plans public outreach on ID sharing dos and don'ts - Sakshi

న్యూఢిల్లీ: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలంటూ ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ గతంలో ఆధార్‌ నంబర్‌ను బయటకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు హ్యాకర్లు శర్మకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు. దీంతో ఆధార్‌ సమాచార గోప్యతపై పౌరులకు సూచనలు చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్ణయించింది. ఇందులోభాగంగా పాన్, బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డు తరహాలో కాకుండా ఆధార్‌ నంబర్‌ గోప్యతను కాపాడుకోవాలని యూఐడీఏఐ చెప్పనుంది.

అలాగే ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను పంచుకోవడంపై హెచ్చరించనున్నట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా ఆధార్‌ కార్డును వాడుకునేందుకు వీలుగా అనుమానాలను తీర్చడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ విషయంలో ప్రజలకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, వాటి సమాధానాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. బయోమెట్రిక్స్, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) వంటి రక్షణ వ్యవస్థలు ఉన్న ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రాయ్‌ చైర్మన్‌ శర్మ ఉదంతం నేపథ్యంలో 12 అంకెలున్న ఆధార్‌ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top