3 నెలల్లోనే ఎన్నారైలకూ ఆధార్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నారైలకూ ఆధార్‌ 

Published Mon, Sep 2 2019 8:08 AM

UIDAI CEO Says Aadhaar For NRIs Will Provide Within 3 Months - Sakshi

న్యూఢిల్లీ: మూడు నెలల్లో భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్‌ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఆరునెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలకు ఆధార్‌ కార్డులు జారీ చేస్తామని సంస్థ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సాంకేతిక మార్పులు ఇప్పటికే చేపట్టామని.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్‌ కోర్డు జారీ కోసం టైమ్‌స్లాట్‌లు బుక్‌ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.

కాగా ఎన్నారైలకు ఆధార్‌ కార్డు జారీపై ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా... యూఐడీఏఐ దేశంలో మరిన్ని ఆధార్‌సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆధార్‌ నమోదు, జారీ, మార్పులు చేర్పుల వంటి అన్ని సౌకర్యాలకూ ఈ సేవా కేంద్రాలు కేంద్రంగా మారనున్నాయి. ప్రస్తుతం ఈ పనులన్నీ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.   

Advertisement
Advertisement