చిన్నమ్మ ఆస్తులు జప్తు?

Two Years Jail Completed To Sasikala - Sakshi

 శశికళ రెండేళ్ల జైలు శిక్ష పూర్తి

ఇంకా చెల్లించని జరిమానా

ఆస్తులు జప్తు అయ్యేనా?

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ అండ్‌ బృందానికి శనివారంతో రెండేళ్ల జైలు శిక్ష ముగిసింది. మరో రెండేళ్ల శిక్షా కాలం అనుభవించాల్సి ఉంది. ఇంత వరకు ఈ ముగ్గురు తలా రూ. పది కోట్ల జరిమానా చెల్లించని దృష్ట్యా, వారి ఆస్తులు జప్తు అయ్యేనా అన్న ప్రశ్న మొదలైంది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్నమ్మ శశికళ సీఎం ఆశల్ని అడియాసలు చేసిన విషయం తెలిసిందే. అమ్మ జయలలిత మరణంతో ఆమెను దోషిగా పేర్కొన్నా, కేసు నుంచి తప్పించారు. ఇక, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌ జైలు శిక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురికి తలా నాలుగేళ్లు జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించింది.

దీంతో 2017 ఫిబ్రవరి 15న సాయంత్రం బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ అండ్‌ బృందం లొంగిపోయారు. అప్పటి నుంచి జైలుకే పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో చిన్నమ్మ శశికళ, ఇలవరసి లగ్జరీ జీవితాన్ని జైల్లో అనుభవిస్తుండడం వెలుగులోకి వచ్చింది. దీనిపై కర్ణాటక సర్కారు విచారణను సైతం ముగించింది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అండ్‌ బృందం జైలుకు వెళ్లి రెండేళ్లు అవుతోంది. శనివారంతో వారి శిక్షలో సగం కాలం గడిచింది. మిగిలిన రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, జైలులో సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా కూడా విడుదల కావచ్చనట్టుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. 

రూ.పది కోట్ల జరిమానా: జైలు శిక్ష తీర్పు సమయంలో ఆ ముగ్గురికి తలా రూ. పది కోట్లు చొప్పున జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. అయితే, ఇంత వరకు ఆ ముగ్గురు జరిమానాను చెల్లించనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ జరిమానా కేసును తొలుత తమ గుప్పెట్లోకి తీసుకున్న తమిళనాడు ఏసీబీ నేతృత్వంలో వసూలు చేయాలా..? లేదా, కేసును నడిపిన కర్ణాటక ప్రత్యేక కోర్టులో చెల్లించాలా అన్న ప్రశ్న తలెత్తడంతో ఇంతకాలం ఆ జరిమానా గురించి ఎవ్వరూ పట్టించుకోనట్టు సమాచారం. శిక్షా కాలంలో సగం రోజులు గడవడంతో తాజాగా ఆ జరిమానా వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి, జరిమానా వసూలు వ్యవహారంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ ఆ మొత్తాన్ని ఆ ముగ్గురు చెల్లించని పక్షంలో కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఆస్తుల జప్తునకు ఆస్కారం ఉందంటున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top