
బెంగుళూరు : ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన కర్ణాటకలోని పాద్రాయణపుర జైలులో చోటుచేసుకుంది. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసిన కేసులో నిందితులైన 119 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిని రామనగర ప్రాంతంలోని పాద్రాయణపుర జైలుకు తరలించారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. వారితో సన్నిహితంగా మెలిగిన మరో 8 మందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.
అయితే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తిచెందుతున్నందున ఖైదీలను రామనగర జైలు నుంచి మరో జైలుకు తరలించాలని జేడీ(ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి డిమాండు చేశారు. తమ ప్రాంతంలో కరోనా ప్రబలుతున్నందున ఖైదీలను ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారని, తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని కుమారస్వామి హెచ్చరించారు. రామనగర నుంచి కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖైదీలకు కరోనా వచ్చినందున జైలు సిబ్బంది, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని కుమారస్వామి సూచించారు.