టీ కప్పులో చిదంబరం ! | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 26 2018 9:49 PM

Twitter Roasts Chidambaram over Coffee Price Tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒకప్పుడు దేశానికే ఆర్థిక మంత్రి.. అంకెల గారడీల్లో ఆరితేరిన వాడు. ద్రవ్యోల్బణ స్థితిగతుల్ని కాచివడబోసినవాడు. కానీ ఇప్పుడు రోజులెలా ఉన్నాయో బొత్తిగా తెలిసినట్టు లేదు. బయట ధరలెలా మండిపోతున్నాయో కాసింత అవగాహన కూడా ఉన్నట్టుగా లేదు.  విమానాశ్రయంలో కప్పు కాఫీ తాగాలన్నా, వేడి వేడిగా చాయ్‌ గొంతులో పోసుకోవాలన్నా జేబుకి చిల్లు పడడం ఖాయం. ఈ విషయం చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతాడు. కానీ మన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఈ విషయంలో కాస్త ఆలస్యంగా జ్ఞానోదయమైనట్టుంది. 

చెన్నై విమానాశ్రయంలో టీ, కాఫీ ధరలపై బోల్డంత ఆశ్చర్యపోతూ ఆయన చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ‘ చెన్నై విమానాశ్రయంలో కప్పు టీ అడిగాను. కాస్త వేడినీళ్లు, టీ బ్యాగ్‌ ఇచ్చి రూ.135 అడిగాడు. ఎంత ఘోరం... నాకు టీ అక్కర్లేదని వచ్చేశా. నేను చేసింది రైటా, తప్పా‘ అని ట్వీట్‌ చేశారు. కాసేపటికే కాఫీ ధరలపైనా మళ్లీ ఆశ్చర్యపోయారు.  ‘చెన్నై విమానాశ్రయంలో కప్పు కాఫీ రూ.180 అని అన్నారు. అసలు ఎవరు కొంటారని అడిగా.. చాలా మంది కొని తాగుతారని సమాధానం వచ్చింది. నేనేమైనా పాతకాలం మనిషినా ? ‘ అని చిదంబరం ప్రశ్నించారు. 

ఈ రెండు ట్వీట్లు సోషల్‌ మీడియాలో సంచలనాన్నే రేపాయి.  చిద్దూ మరీ అంత అమాయకత్వమా అంటూ నెటిజన్లు రీ ట్వీట్ల వర్షం కురిపించారు. మరికొందరు చిదంబరం ఆర్థిక పరిజ్ఞానం మీదే సందేహాలు వ్యక్తం చేశారు. నిజంగానే మీరు పాతకాలం మనిషే , ఎందుకంటే మీ జేబులోంచి పైసా కూడా ఖర్చు చేసి ఉండరు కదా అని ఒకరంటే,. అవునా! మహాత్మా గాంధీ మరణించారా? అన్నట్టుగా మీ ట్వీట్లు ఉన్నాయంటూ  మరొకరు కామెడీ పండించారు.  ఇంకొందరు ఆయన కుమారుడు కార్తీ మనీల్యాండరింగ్‌ కేసుని ప్రస్తావిస్తూ ధరాఘాతం ఎలా ఉంటుందో తెలీకపోతే ఎలా అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ధరలు ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయి. అప్పుడు ఎందుకు ట్వీట్‌ చేయలేదంటూ మరి కొందరు నిలదీశారు. 

Advertisement
Advertisement