
ములాయం కుటుంబంలో చిచ్చు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట విభేదాలు భగ్గుమన్నాయి.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట విభేదాలు భగ్గుమన్నాయి. కువామి ఏక్తాదల్ (క్యూఈడీ)ను ఎస్పీలో విలీనం చేసుకోకపోవడంపై ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. బుధవారం ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలకు ఆలస్యంగా చేరుకున్న శివ్‌పాల్ వేదికపైకి వెళ్లకుండా అతిథుల మధ్యే కూర్చున్నారు. అయితే పార్టీ నేతలు చెప్పడంతో వేదిక వద్దకు వెళ్లినా వెనక వరుసలో కూర్చున్నారు. మళ్లీ సీనియర్ నేతలు కల్పించుకోవడంతో ముందు వరుసలో కూర్చున్నారు.
వేడుకలో ములాయం, అఖిలేశ్‌లను శివ్‌పాల్ పలకరించలేదు. గోపాల్‌కు శుభాకాంక్షలు తెలపలేదు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా శివ్‌పాల్ హాజరుకాలేదు. కుయామీ ఏక్తాదల్‌ను ఎస్పీలో విలీనం చేసుకోడానికి గతవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు అంగీకరించనప్పటి నుంచి శివ్‌పాల్ అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2017 లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ములాయం ఇంట ఈ వివాదం చర్చనీయాంశమైంది.