ఖనిజ సంపద దోచేందుకే..

Tribals Protest Against Gurupriya Bridge - Sakshi

గురుప్రియ వంతెన నిర్మాణం

గిరిజనులపై ప్రేమతో దీనికి శ్రీకారం చుట్టలేదు

చిత్రకొండ కటాఫ్‌ ఏరియా దళ అధినేత సుధీర్‌

పనాస్‌పుట్‌లో మావోయిస్టుల భారీ మేళా

మల్కన్‌గిరి : మన్యం నుంచి ఖనిజ సంపద దోచేందుకే ఆంధ్రా–ఒడిశా ప్రభుత్వాలు గురుప్రియ వంతెన నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలపై ప్రేమతో దీనికి శ్రీకారం చుట్టలేదని చిత్రకొండ కటాఫ్‌ ఏరియా దళ అధినేత సుధీర్‌ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వనరులు, ఖనిజ సందను ఇక్కడ నుంచి యథేచ్ఛగా తరలించేందుకే రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారని తెలిపారు. పెట్టుబడిదారీ వర్గాలకు, పారిశ్రామిక వేత్తలకు ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

గిరిజనుల అభ్యున్నతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి కనీస సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు. మల్కన్‌గిరి జిల్లాలో చిత్రకొండ సమితి కటాఫ్‌ ఏరియాలోని పనాస్‌పుట్‌ పంచా యతీలో మావోయిస్టులు ఆదివారం భారీ మేళా నిర్వహించారు. మావోయిస్టుల ఉనికిని కాపాడుకునేందుకు గత వారం రోజులుగా మావో వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చివరి రోజు చిత్రకొండ కటాఫ్‌ ఏరియా దళ అధినేత సుధీర్‌ నేతృత్వంలో పనాస్‌పుట్‌ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను అణచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. మావోయిస్టుల అణచివేత ఎప్పటికీ జరగదన్నారు. మావోలు కేవలం ఆదివాసీల కోసమే పోరాటం చేసి వారికి మేలు చేస్తారన్నారు. వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎంతవరకైనా పోరాడుతారన్నారు.

దానికి కోసం ఎంతమంది అయినా ప్రాణాలు త్యాగాలు చేస్తామని అక్కడ నూతనంగా నిర్మించిన స్థూపంపై ప్రమాణం చేశారు. ముందుగా అమరులైన మావోయిస్టుల కోసం నూతన స్థూపం నిర్మించి మావోయిస్టులు, గిరిజనులు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన చుట్టుపక్కల గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు విప్లవ గీతాలను ఆలపించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top