అనుమతిపై తేల్చని జేఎన్‌యూ | Sakshi
Sakshi News home page

అనుమతిపై తేల్చని జేఎన్‌యూ

Published Tue, Feb 23 2016 1:11 AM

అనుమతిపై తేల్చని జేఎన్‌యూ

విద్యార్థుల అరెస్టుకు పోలీసుల ఎదురుచూపులు
వర్సిటీలో ఉమర్ ప్రత్యక్షం

 
 న్యూఢిల్లీ: జేఎన్‌యూ క్యాంపస్‌లోకి పోలీసుల్ని అనుతించాలా లేక విద్యార్థుల్ని లొంగిపోమనాలా అనేదానిపై తేల్చకుండానే జేఎన్‌యూ పాలకమండలి భేటీ ముగిసింది.  రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్‌లు ఆదివారం వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. వార్త తెలియగానే పోలీసు బృందం వర్సిటీకి చేరుకుని వీసి అనుమతి కోసం ఆదివారం రాత్రి నుంచి ఎదురుచూసింది. దీంతో వర్సిటీ వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. పోలీసుల్ని అనుమతించవద్దంటూ 300 మంది అధ్యాపకుల  బృందం వీసీని కోరింది. రాజద్రోహం కేసులు ఉపసంహరించుకునేలా పోలీసుల్ని కోరాలంటూ విద్యార్థులు  విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ...లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌ను కలిసి వివాదంపై వివరించారు.  

► వివాదంపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ కమిటీకి.. సాక్ష్యాల పరిశీలన కోసం వర్సిటీ మరో 7 రోజుల గడువునిచ్చింది.  
► ఫిబ్రవరి 15న పటియాలా కోర్టు దాడి కేసులో ఇతర అంశాల పరిశీలనకు అంగీకరింబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దాడిపై సుప్రీంకోర్టుకు పోలీసులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్  నివేదిక సమర్పించారు. సుప్రీం నియమిత  కమిటీ నివేదికకు విరుద్ధంగా ఈ రెండు ఉన్నట్లు సమాచారం.
► తిహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూఎస్‌యూ నేత కన్హయ్యను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. కన్హయ్య తన నిర్దోషిత్వ నిరూపణకు సంజాయిషీ ఇవ్వనవసరం లేదని తల్లి ఇచ్చిన సందేశాన్ని సోదరుడు అందించారు.

 నాకే తెలియనివి తెలిశాయి: ఉమర్
 ‘నేనేమిటో నాకే తెలియని విషయాలు గత వారంలో నాకు బాగా తెలిసొచ్చాయి. నా పేరు ఉమర్ ఖాలిదే కానీ, నేను ఉగ్రవాదిని కాను’ అనిస్కాలర్ ఉమర్ ఖాలిద్ చెప్పారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉంటుందన్న హామీమేరకు ఆయన ఆదివారం వర్సిటీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఖాలిద్ 500 మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘నాకు పోస్‌పోర్టు లేకున్నా రెండుసార్లు పాక్‌లో ఉన్నాను’ అని వ్యంగ్యంగా అన్నారు.

Advertisement
Advertisement